Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టుల వికృత చర్యల వలన నిరంతరం ప్రాణభయంతో బ్రతుకుతున్న ఆదివాసీలు
- సిఐ బి.అశోక్
నవతెలంగాణ-చర్ల
నిషేధిత సిపిఐ మావోయిస్టులు అమర్చిన మందుపాతరను చెర్ల పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఆ మేరకు చర్ల సిఐ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో శనివారం సాధారణ తనిఖీలలో భాగంగా చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, సీఆర్పీఎఫ్ 141 సిబ్బంది, బీడీ టీమ్ కలిసి చర్ల మండలంలోని బోదనెల్లి- ఏర్రబోరు గ్రామాల మధ్య ప్రధాన రహదారిలో తనిఖీ చేస్తుండగా, పోలీసులే లక్ష్యంగా చేసుకుని నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన దాదాపు 20 కిలోల మందు పాతరను గుర్తించి నిర్వీర్యం చేశారు. ఈ రహదారి చర్ల మండలంలోని కుర్ణపల్లి, బత్తినపల్లి, రామచంద్రాపురం, ఎర్రబోరు గ్రామాలకు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల ప్రజలకు ప్రధాన రహదారి. ఈ రహదారి గుండా ప్రతి రోజూ అనేక మంది ప్రయాణం సాగిస్తుంటారు. అలాగే కూలీ పనుల నిమిత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వచ్చే ఆదివాసీలకు ప్రధాన మార్గం. ఇటువంటి రహదారుల వెంట ప్రయాణించే వారికి ప్రాణ నష్టం కలిగించే విధంగా నిషేధిత మావోయిస్ట్ పార్టీ మందు పాతరలను అమర్చుచున్నది. అలాగే ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నది. గత సంవత్సరకాలంగా మావోయిస్టు పార్టీ సభ్యులు పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఆదివాసీ ప్రజలు తిరిగే రోడ్ల ప్రక్కన, ఆదివాసీల పోడు భూములకు, గ్రామాలకు సమీపాన, పశువులు మేతకు వెళ్లే గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ప్రెషర్ బాంబులను, మందు పాతరలను అమర్చడం జరిగిందన్నారు.
ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి
ఆదివాసీల అటవీ భూముల్లో, పోడు వ్యవసాయ భూముల్లో, అటవీ మార్గాన అనాలోచితంగా, మూర్ఖంగా ప్రెషర్ బాంబులను, మందు పాతరలను అమర్చి, ఆదివాసీ ప్రజలు, పశువుల ప్రాణాలకు హాని తలపెడుతున్న మావోయిస్టు పార్టీ సభ్యుల అనాలోచిత చర్యలను ఖండించాలన్నారు. వారిని గ్రామాలు, అడవుల నుంచి తరిమి వేయవలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.