Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిష్కారానికి కందాళ హామీ
నవతెలంగాణ- నేలకొండపల్లి
నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీలోని ఎస్సీ, బీసీ కాలనీని ఆదివారం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సందర్శించారు. కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే తమ కాలనీకి రావడంపై కాలనీవాసులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రతిసారి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ, చనిపోయిన బాధిత కుటుంబాలకు పదివేల రూపాయల ఆర్థిక సాయం, ఇతర శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకి పరిమితమయ్యే తమ ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు రావడం పట్ల అక్కడి ప్రజలు పలు రకాలుగా చర్చించుకోవడానికి దారి తీసాయి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యే జనానికి మరింత చేరువేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగమంటూ కొంతమంది చర్చించుకోవడం గమనార్హం, ఏది ఏమైనా తమ కాలనీని సందర్శించిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని కాలనీవాసులు స్వాగతిస్తూ గత అనేక ఏళ్లుగా కాలనీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై తమ గోడు వినిపించారు. కాలనీ ఏర్పాటు నుండి నేటి వరకు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో ఉన్న మొత్తం 21 రహదారులలో కేవలం ఒక రహదారి మాత్రమే ఇటీవల సిసి రోడ్డుగా నిర్మాణం చేశారని అది కూడా నాసిరకంగా ఉండడంతో రహదారిపై నడవాలంటేనే వాహనాలపై వెళ్లాలంటేనే తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నమన్నారు. మిగిలిన 20 రహదారులు సక్రమంగా లేకపోవడంతో పాటు సైడ్ డ్రేయిన్ నిర్మాణం చేయకపోవడంతో వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరి దోమలు, ఈగలకు ఆవాసాలుగా మారుతున్నాయన్నారు. దీనివల్ల రోగాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ నుండి విద్యుత్ అధికారులు లెవెన్ కె.వి విద్యుత్ వైర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తుండటంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయంతో బిక్కు బిక్కు మంటూ రోజులు గడుపుతున్నామన్నారు. కాలనీకి దగ్గరలో స్మశాన వాటిక లేకపోవడంతో దహన సంస్కారాలకు సుదూర ప్రాంతానికి వెళ్లలేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి కాలనీలో తాము ఎదుర్కొంటున్న రహదారుల సమస్యలను పరిష్కరించాలని, 11 కెవి విద్యుత్తు లైను తొలగించాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని, శిధిలావస్థకు చేరుకున్న అంగన్వాడీ భవనాన్ని తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. కాలనీవాసుల సమస్యలపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులను పిలిచి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, తహసీల్దార్ ధార ప్రసాద్, ఎంపీడీవో కే జమలారెడ్డి, స్థానిక సర్పంచ్ రాయపూడి నవీన్, ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మి, బొడ్డు బొందయ్య, దోసపాటి కల్పన, సిడిసి చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాద్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య, నంబూరి సత్యనారాయణ, వంగవీటి నాగేశ్వరరావు, గొలుసు రవి, రాయపూడి శ్రీనివాసరావు, భాజ నాగేశ్వరరావు, కెవి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.