Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే సీపీఐ(ఎం) ఆశయమని పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో తమ్మినేని సుబ్బయ్య ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహించే వైద్య శిబిరాన్ని ఆదివారం నున్నా ప్రారంభించారు. ఈ సందర్భంగా నున్నా మాట్లాడుతూ భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 70 కోట్ల మంది బీపీ, షుగర్లతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కుటుంబాలలో కూడా ఈ మహమ్మారి వ్యాధులు వ్యాపించి ఉన్నాయని వీటి నివారణకు వేల రూపాయల ఖర్చు అవుతుందని భారం భరించలేక ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సిపిఎం ఆధ్వర్యంలో తమ్మినేని సుబ్బయ్య ట్రస్ట్ తరఫున బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు కేవలం 100 రూపాయలకే నెలకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సామాజిక సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వైద్య శిబిరంలో అనుభవమైన డాక్టర్లచే పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గ్యాస్ట్రో వైద్యులు డాక్టర్ సి.భారవి, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ పొన్నం వెంకటరమణ, వైద్య శిబిరం నిర్వాహకులు నండ్ర ప్రసాద్, ఉరడీ సుదర్శన్‌రెడ్డి, నందిగామ కృష్ణ, యం.సుబ్బారావు, తోట నరేష్‌రెడ్డి, ఇంటూరి అశోక్, గోగుల నాగరాజు, వై.శ్రీనివాసరావు, అఫ్జల్, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.