Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష
నవ తెలంగాణ- ఖమ్మంరూరల్
మండలంలోని మద్దులపల్లి గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఒకరోజు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ ప్రారంభించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడారు. గ్రామ సమస్యల పరిష్కారానికి దీక్షకు సిద్ధమైన సీపీఎం గ్రామ శాఖను ప్రత్యేకంగా అభినందిం చారు. ఖమ్మం నగరానికి కూత వేట దూరంలో ఉన్న మద్దులపల్లిలో పలు సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దులపల్లిలో 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఇందిరమ్మ కాలనీ ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఆ ఇళ్ళు ఎప్పుడు కూలిపోతాయో తెలియక ప్రజలు భయాందోళనలో ఉన్నారని, వారికి పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మోడల్ కాలనీలో మిగిలిపోయిన ఫ్లాట్లను గుర్తించి అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ క్రీడా ప్రాంగణంలో వాకింగ్ ట్రాక్, ఆట వస్తువులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. గ్రామంలో లైబ్రరీ నిర్వహించి యువతకు ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహించాలని కోరారు. కోదాడ క్రాస్ రోడ్ నుండి మద్దులపల్లి గ్రామం వరకు డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని పలుమార్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసిన వినిపించుకున్నామని, ఇప్పటికైనా స్థానిక యంఎల్‌ఏ కందాళ ఉపేందర్‌రెడ్డి జోక్యం చేసుకొని డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
దీక్షకు సంఘీభావం తెలిపిన సీపీఐ (ఎంఎల్), సీపీఎం, బీఎస్పీ నాయకులు
సమస్యల పరిష్కారానికి దీక్ష చేస్తున్న సిపిఎం నాయకులకు సిపిఐ (ఎంఎల్) మండల కార్యదర్శి శీలం సుదర్శన్, మండల నాయకులు సప్పిడి వెంకటేశ్వర్లు, సిహెచ్.భాస్కర్ సంఘీభావం తెలిపారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అల్లిక వెంకటేశ్వర్లు, కార్యదర్శి పీసీ. వీరస్వామి, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ ఐతగని శ్రీనివాస్ గౌడ్, తెల్దారుపల్లి సర్పంచ్ సిద్దినేని కోటయ్య, సీపీఎం నాయకులు తమ్మినేని వెంకట్రావు, నండ్ర ప్రసాద్, పొన్నెకంటి సంగయ్య, ఎస్కే రంజాన్ పాషా, జక్కంపూడి కృష్ణ, వేగినాటి వెంకటేశ్వర్లు, భానోత్ శ్రీనివాస్, సిరికొండ నగేష్, పట్టాభి, జలగం వెంకట్రావు, బోడపట్ల నరేష్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్లపూడి సుభద్ర, సిపిఎం నాయకులు పెంట్యాల నాగేశ్వరరావు, కర్లపూడి వెంకటేశ్వర్లు, తుమాటి నాగయ్య, తుమాటి మధుబాబు, ఉదరు, సతీష్, ప్రవీణ్, గోసు వీరబాబు, నరేందర్, అనిల్, వసంతరావు,నర్సింహా రావు, చారి తదితరులు పాల్గొన్నారు.