Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షలు నిర్వహించక కాలయాపన
- ఉపాధి కోల్పోతున్న నిరుద్యోగులు
- ప్రజలకు ఇబ్బందులు... ఆర్థిక నష్టం
- త్వరలో పరీక్షలు నిర్వహిస్తాం...ఇడిఎం పార్థసారధి
నవతెలంగాణ కొత్తగూడెం
ప్రజలకు సౌకర్యార్ధం డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక రూపాల్లో సేవలందిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న అనేక కార్యక్రమాలను 'మీ-సేవల' ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిజిటల్ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తుంది. కుల, ఆదాయ, ఇంటి, ఆస్తిపన్ను, జనన, మరణ, ఇతర భూ సంబంధ దృవీకరణ పత్రాలతో పాటుగా ఇత ప్రభుత్వ బిల్లుల చెల్లింపులను కూడా ప్రజల నుండి సేకరిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కొత్త ప్రదేశాలలో 'మీ-సేవ' సెంటర్లను ఏర్పాటు చేసుకునేందుకు 2022 మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆశ్వారావుపేట, గుండాల, టేకులపల్లి, కరకగూడెం నాలుగు మండలాలకు గాను 10 మీ సేవా కేంద్రాలకు ఎంపికకు ప్రకటన జారీ చేశారు. స్థానికంగా ఉన్నవారికి, 10వ తరగతి నుండి ఏదేని డిగ్రీ వరకు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది గడుస్తున్న నేటి వరకు అర్హులైన వారికి పరీక్షలు నిర్వహించలేదు. ఎంపికలు జరుగలేదు. కేంద్రాలు ఏర్పాటు కాలేదు. గత ఏడాదిగా దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువత ఉపాధి కోల్పోతున్నారని వాపోతున్నారు. ఏడాది క్రితం సెంటర్ కేటాయించినట్లయితే ఇప్పటికే వేలాది రూపాయల ఉపాధి వారికీ లభించేదంటున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలకు మీ-సేవా సౌకర్యం ఉండేదంటున్నారు. ప్రభుత్వం గుర్తించిన ఆయా సెంటర్లలో మీసేవ కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీని వలన వారి విలువైన సమయం, ప్రయాణంతో ఆర్థికంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని 10 నెలలు గడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తున్న తరుణంలో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఉందంటున్నారు. పరీక్షలు లేవు, ఎంపికలు లేవు. మీసేవ సెంటర్లను ఇప్పటివరకు కేటాయించలేదు. పలుమార్లు పరీక్షా తేదీలు ప్రకటించారు. వివిధ కారణాల రీత్యా వాటిని మార్పుచేశారని వాపోతున్నారు. మీ సేవా సెంటర్స్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పటికి పలుమార్లు గ్రీవెన్స్ డే లో విన్నవించినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి మీ-సేవ సెంటర్ల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి, అభ్యర్థును ఎంపిక చేసి మీ సేవా సెంటర్లు కేటాయిస్తే నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో మీసేవ సెంటర్ల ద్వారా పొందే సేవలను ప్రజలు అందుకునే అవకాశం మెరుగవుతుందంటున్నారు. ఇదే విధంగా కాలయాపన అయితే ఆయా ప్రాంతాల ప్రజలు మీ సేవా సెంటర్స్ ద్వారా పొందే సేవలు దూరమవుతాయని, దూర ప్రాంతాలకు వెళ్లి ఆర్థికంగా, సమయంగా నష్టపోవాల్సి వస్తుందని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైన జిల్లా కలెక్టర్ స్పందించి అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి, అర్హులైన వారికి మీ సెవా సెంటర్స్ ద్వారా ప్రజలకుసేవలందించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
త్వరలో ఎంపికలు...పార్థసారధి, మీ సేవా, ఇడిఎం
జిల్లాలో మీ సేవా సెంటర్స్ నిర్వహణ కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి త్వరలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపికలు చేస్తామని జిల్లా ఇడిఎం కె.పార్ధసారధి తెలిపారు. అభ్యర్థులు నిరుత్సాసహానికి గురికావద్దని సూచించారు.