Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
ప్రతి ఒక్క విద్యార్థి తమతమ విద్యార్థి దశలోనే చదువుతోపాటు చక్కటి సంస్కారం నేర్చుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధి కల్పన అధికారిని వేల్పుల విజేత స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక వనవాసి కళ్యాణ పరిషత్ విద్యార్థి వసతి గృహం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆమె మాట్లాడారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే సత్ఫలితాలను పొందుతాడని ఆమె అన్నారు. ప్రతి వ్యక్తి దేశభక్తిని కలిగి ఉండాలని ఆమె కోరారు. దాతల సహకారంతో కొనసాగుతున్న చెర్ల కొమరం భీం విద్యార్థి నిలయంకు తన వంతుగా పదివేల రూపాయల చెక్కును అందజేసి ఆమె దాతృత్వాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి స్థానిక తహసిల్దార్ బీర వెళ్లి భరణి బాబు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న 18 గొత్తి కోయ హ్యాపీటేషన్లో ఉన్న చిన్నారులకు వనవాసి కళ్యాణ పరిషత్ విద్యాబుద్ధులు నేర్పించడం అభినందదాయకమని అన్నారు. ముందు ముందు ఎక్కువ మంది విద్యార్థులకు వనవాసి కళ్యాణ పరిషత్ ప్రవేశాలు కల్పించి విద్య, వినయంతో కూడిన విద్యాబుద్ధులు నేర్పించాలని ఆయన ఆకాంక్షించారు. తమలో దాగివున్న రుగ్మతలను వీడి ప్రతి ఒక్క మనిషి ఆదర్శవంతంగా జీవించాలని తాసిల్దార్ కోరారు. వనవాసిలో ఉండే విద్యార్థులు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటారని సర్పంచ్ కాపల కృష్ణార్జున రావు అన్నారు.
వనవాసులు తెలివి తక్కువ వారు కాదు :
వనవాసులు తెలివి తక్కువ వారు కాదని వారిలో అపారమైన మేధాశక్తి ఉంటుందని కార్యక్రమానికి ముఖ్య వక్తగా వచ్చిన లింగం శ్రీధర్ జి.అన్నారు. మట్టిలో మాణిక్యాల ఉండే వారి తెలివితేటలను వెలికి తీసే కొద్దీ వనవాసుల జ్ఞానాన్ని గుర్తించొచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వనవాసి విద్యార్థుల ఆలపించిన గీతాలపనలు, అభినయ గేయాలు, కింద నుంచి పైకి చెప్పిన ఎక్కాలు, శ్లోకాలు తెలుగు మాసాలు, తెలుగు తిధులు, తెలుగు సంవత్సరాలు, భారతమాత, శ్రీరాముడు, వివేకానందుని వేషధారణలు వెలసి మొత్తంగా విద్యార్థుల క్రమశిక్షణ పలువురని ఆకట్టుకుంది.
ఘనంగా కొమరం భీం విద్యాలయ నూతన భవన ప్రారంభం
మండల కేంద్రంలో ఉన్న వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యాలయం ప్రాంగణంలో హైదరాబాద్ వాస్తవ్యులు పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వనవాసి కళ్యాణ్ పరిషత్ నిలయం స్వర్గీయ శ్రీ రామా కాంత్ దేశ పాండేకి అంకితమిస్తూ శ్రీనివాసరావు జ్యోతిర్మయి దంపతులు, గోంగులూరి రమణమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు కుమార్తెలు అల్లుళ్లు ఇచ్చిన విరాళాలతో నిర్మించిన నూతన భవన ప్రారంభోత్సవానికి పుల్లారెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి విజేత వేల్పుల, వనవాసి కళ్యాణ పరిషత్ జిల్లా అధ్యక్షులు మోకాళ్ళ వెంకటేశ్వరరావు, తాసిల్దార్ బీరవెల్లి భరణి బాబు, సర్పంచ్ కాపుల కృష్ణార్జునురావు లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి శ్రీ పాద, శ్రీనివాసరావు, జ్యోతిర్మయి దంపతులు తెలంగాణ సహ ప్రాంత మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత, కార్యనిర్వాహన సభ్యులు బందా స్వరూపారాణి, వనవాసి కళ్యాణ పరిషత్ గౌరవ సలహాదారులు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బివిఎస్ఎల్ నరసింహారావు, వార్డు సభ్యులు దొడ్డిహరి నాగవర్మ, కొమరం భీం విద్యాలయం అధ్యక్షులు తాటి పాపారావు, జిల్లా సహ కార్యదర్శి కోరం సూర్యనారాయణ, జిల్లా సహ విద్యా ప్రముఖ్ సున్నం రాజేష్, కోరం రామారావు, ప్రఖండ సంఘటన కార్యదర్శి గొంది శోభన్ బాబు, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న, కమిటీ సభ్యులు జి.రామ లక్ష్మణ్, పూనెం మంగరాజు, తాటి శ్రీనివాస్, సింగ సంతోష్, వార్డు సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు సాయి నగర్ వాసులు తదితరులు పాల్గొన్నారు.