Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఐటీడీఏ ద్వారా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలలోని అర్హులైన గిరిజన కుటుంబాలకు తప్పనిసరిగా అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ సాధ్యమైనంత తొందరగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ద్వారా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని ఆయన అన్నారు. సోమవారం గిరిజన దర్బార్లో సమర్పించిన అర్జీలు సీఎం గిరి వికాసం ద్వారా కరెంటు, బోరు, మోటారు, గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడం కోసం, ఆర్ఓఎఫ్ ద్వారా పోడు భూముల పట్టాలు అందించుట కోసం, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు త్రీఫేస్ కరెంటు సౌకర్యం కోసం, భూ సంబంధమైన సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగం సంపాదించి జీవనభృతి పెంపొందించుకోవడానికి తగిన శిక్షణ ఇప్పించుట కొరకు, నిరుద్యోగులైన గిరిజన యువతీ, యువకులు స్వయం ఉపాధి ద్వారా జీవనాధారం పెంపొందించుకోవడానికి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుట కోసం, అలాగే పై చదువులు చదువుకోవడానికి ఆర్థిక సహాయం, సరియైన వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం, కిరాణా ఫ్యాన్సీ షాపులు పెట్టుకోవడానికి రుణాలు, గేదెలు, గొర్రెలు కొనుగోలుకు రుణ సదుపాయం, రైతుబంధు సహాయం ఇప్పించుట, జీవనోపాధి ద్వారా ఆర్థిక సహాయం కోసం, ఇతర సంక్షేమ పథకాలు కోసం అర్జీలు సమర్పించుకున్నారని ఆయన అన్నారు. గిరిజన దర్బార్లో సమర్పించిన అర్జీలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, విడతల వారీగా అర్హులైన గిరిజన కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా కృషి చేస్తున్నట్టు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ(జనరల్) డేవిడ్ రాజ్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, ఏవో భీమ్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఎస్ఓ సురేష్ బాబు, ఏడీ అగ్రికల్చర్ భాస్కర్, ఏసీఎంవో రమణయ్య, మేనేజర్ ఆదినారాయణ, డీటీఆర్ఓఎఫ్ఆర్ శ్రీనివాస్, ఏపీవో (పవర్) మునీర్ పాషా, డీఎస్ఓ ప్రభాకర్ రావు, జేడీఎం హరికృష్ణ, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.