Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాక్ 13వ వర్ధంతి సభలో వక్తల పిలుపు
నవతెలంగాణ-భద్రాచలం
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడటమే ఉస్తెల విశాక్కు ఇచ్చే నివాళి అని విశాక్ 13వ వర్థంతి సభలో పలువురు వక్తలు అన్నారు. మంగళవారం భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీ నందు విశాక్ 13వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భముగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి స్తూపం దగ్గర ఏర్పాటు చేసిన జండా ఆవిష్కరణ చేశారు. చిత్రపటానికి జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ చిన్న వయసులోనే విశాక్ అకాల మరణం చెందినారని, ఆయన మరణం పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. పార్టీలో పని చేసేటప్పుడు యువజన సంఘం డీవైఎఫ్ఐలో ఉంటూ అతి చిన్న వయసులోనే 40 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారని అలాగే ఏఎంసీ కాలనీ ఏర్పాటు విషయంలో గాని అభివృద్ధి విషయంలో ఎంతో పాటుపడినరన్నారు. నేడు ఉన్న పాలక ప్రభుత్వాలు బడ్జెట్ల పేర్లతో ప్రజల సంపదనంతా కరిగిస్తున్నారని, ప్రజా వ్యతిరేక పరిపాలన కొన సాగిస్తున్నారని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని కులతత్వాన్ని రెచ్చగొడుతూ కాలం గడుపుతున్నద న్నారు. వుస్తెల జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వైవి రామారావు, పి.సంతోష్, ఎన్.లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు, డి.లక్ష్మి, యు.జ్యోతి, కుంజ శీను, జీవనజ్యోతి, శాఖా కార్యదర్శులు అల్లాడి సత్యవతి, కాకా రమణ, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.