Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డప్పులు, సంబురాలతో పోతురాజుకు గంగ స్నానం
- ప్రేక్షకులను అలరించిన బాలనాగమ్మ (వైరైటీ బుర్రకధ)
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల కేంత్రమైన దుమ్ముగూడెం గ్రామంలో జరుగుతున్న గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 22వ జాతర మహౌత్సవములు మంగళవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. జాతర ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా కూనవరం వాస్తవ్యులు ఇచ్చినటువంటి పట్టు చీరతో అమ్మవారి ఉదయం అలంకరణతో పాటు అభిషేకములు, పుష్పాలంకరణ, కుంకుమపూజలు అనంతరం అనంతరం పోతురాజుకు గోదావరి నీళ్లతో భక్తి శ్రద్దలతో గంగ స్నానం, విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మేళ తాళాలు, డప్పులతో సంబురాలు నిర్వహిస్తున్న సమయంలో గరుడ స్థంభం గంట మోగడాన్ని భక్తులు భక్తి శ్రద్దలతో వీక్షించారు. మద్యాహ్నం అలంకరణ చర్ల మండలం గోగుబాక గ్రామ వాస్తవ్యులు సాగి వెంకటజగన్నాధరాజు, సౌదామణి, వారి కుమారుడు సిద్దార్ద రాజు ఇచ్చినటువంటి పట్టు చీరతో మద్యాహ్నం అలంకరణతో పాటు వారు అందజేసిన రూ.10,116లతో మద్యాహ్నం అన్నదానం నిర్వహించారు. సాయంత్రం అలంకరణ దుమ్ముగూడెం వాస్తవ్యులు బైరెడ్డి సీతారామారావు, లత వారి కుటుంబ సభ్యులు అందజేసిన పట్టు చీరతో సాయంత్రం అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండవ రోజు సుమారు 3 వేల మందికి అన్నదానం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి కళావేదిక వద్ద విజయనగరం జిల్లా పల్లంకి వారిచే నిర్వహించిన బాలనాగమ్మ బుర్రకధ ప్రేక్షకులను అలరించింది అనే చెప్పవచ్చు. సర్పంచ్ మడి రాజేష్, కార్యదర్శి సందీప్ ఆద్వర్యంలో గ్రామంలో ప్రత్యేక పారిశుద్య పనులు చేపడుతున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.