Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు
- అస్తవ్యస్తంగా సాగర కాలువల, నీటి నిర్వహణ
- నలుగురు ఏఈ లకు ఒక్కరే
- 29 కాలవలు - ఆరుగురు లస్కర్లు నిర్వహణ ఎలా సాధ్యం?
నవతెలంగాణ-బోనకల్
బోనకల్ బ్రాంచ్ కెనాల్ (బీబీసీ) పరిధిలోని బోనకల్ ఎన్ఎస్పి కార్యాలయం సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. బోనకల్ నీటిపారుదల శాఖ కార్యాలయం పరిధిలో మేజర్, మైనర్ కాలవలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కానీ అందుకు అనుగుణంగా సిబ్బంది మాత్రం లేదు. దీంతో కాలువల, నీటి సరఫరా నిర్వహణ అస్తవ్యస్తంగా మారి పంట పొలాలకు సాగునీరు అందించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అన్నదాతలు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బోనకల్ సబ్ డివిజన్ నీటిపారుదల శాఖ కార్యాలయానికి ఒక డిఈ ఉండాలి. ఆ డిఈ గా పబ్బతి శ్రీనివాస్ ఉన్నారు. నలుగురు ఏఈఈలు ఉండాలి. కానీ ఓకే ఒక ఏఈఈ మాత్రమే ఉన్నారు. ఎఈఈగా రాజేష్ ఉన్నారు. ఎనిమిది మంది వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండాలి, కానీ ఒక్కరూ మాత్రమే ఉన్నారు. 29 మంది లస్కర్లు ఉండాలి, కానీ ఆరుగురు మాత్రమే ఉన్నారు.
మండలంలో మొత్తం 29 కాలువలు ఉన్నాయి. ఇందులో 8 మేజర్లు, 21 మైనర్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు సిబ్బంది లేక కాలువల నిర్వహణ, సాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉండగా ఇటీవల చెరువులను, ఎత్తిపోతల పథకాలను, ఇతర కాలువలను నీటిపారుదల శాఖ పరిధిలోకి ప్రభుత్వం తీసుకు వచ్చింది. మండలంలో బీబీసీ కాకుండా 33 చెరువులు, 10 ఎత్తిపోతల పథకాలు జాలిముడి ఎడమ, కుడి కాలువలు ఉన్నాయి. జాలిముడి కాలువ మండలంలో 18 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. దీని నిర్వహణ కూడా నీటిపారుదల శాఖ అధికారులు చూడవలసి ఉంది. బోనకల్లు సబ్ డివిజన్ పరిధిలో కలకోట, లక్ష్మీపురం, గార్లపాడు, వల్లాపురం, పోలంపల్లి, నాగులవంచ -1, నాగులవంచ-2, 4 ఆర్,5 ఆర్డిపీలు ఉన్నాయి. ఈ డీపీల ద్వారా కేవలం రామాపురం గ్రామాల రైతులకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. బోనకల్లు బ్రాంచ్ కెనాల్ కింద 84 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. బోనకల్ నీటిపారుదల శాఖ కింద 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో కేవలం బోనకల్ నేటిపారుదల శాఖ కార్యాలయం కిందే 28 శాతం పొలం మండలంలో ఉంది. 29 మేజర్లు, మైనర్ల కాలువలకు 29 మంది లస్కర్లు విధులు నిర్వహించవలసి ఉండగా కేవలం ఆరుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆరుగురే కాలవలు అన్నింటిపై విధులు నిర్వహిస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కొక్క కాలువకు ఒక్కొక్క లస్కర్ విధులు నిర్వహించవలసి ఉంది. ఆరుగురు లస్కర్ లు 29 కాలువలపై విధులు ఎలా నిర్వహిస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పవలసి ఉంది. సిబ్బంది కొరతతో మండలం లో సాగర్ ఆయకట్టు కింద సాగు చేసిన పంట పొలాలకు ఏ విధంగా సాగర్ నీరు అందిస్తారో దీనిని బట్టి అర్థం అవుతుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందితో కాలువల నిర్వహణ, నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. దీనివలన ఏ కాలవకు ఎప్పుడు, ఎలా, ఎవరు, సాగర్ నీటిని సరఫరా చేస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితి ఉంది. దీని ఫలితంగా అన్నదాతలు సాగర్ నీరు అందటం లేదని ఆందోళనలకు దిగుతున్నారు. రైతులు వచ్చి ఆందోళన చేస్తే గాని ఏ కాలువకు సాగర్ నీరు సరఫరా అవుతుందో, లేదో అధికారులకు తెలియటం లేదు. మండలంలో అత్యధికంగా కలకోట మేజర్ కింద పంటలు సాగవుతున్నాయి. ఈ మేజర్ కింద గల చివరి గ్రామాల రైతుల పంట పొలాలకు గత 15 సంవత్సరాల కాలంలో ఏనాడు అందలేదని రాయన్నపేట, కలకోట, నారాయణపురం గ్రామాల రైతులు అంటున్నారు. కలకోట మేజర్ నుంచి సాగర్ నీరు జానకిపురం, రావినూతల మధ్యగల జగ్గయ్యపేట, వైరా ప్రధాన రహదారి దాటి రావడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారబందీ విధానం అమలు చేయటం వల్లే తాము సాగర్ ఆయకట్టు కింద సాగు చేసిన మొక్కజొన్న పంట ఎండి పోతుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వల్ల సాగర కాలువల కింద సాగుచేసిన మొక్కజొన్న పంట ఎండిపోతుందని ఆళ్లపాడు, గోవిందాపురం(ఏ), రావినూతల తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు బోనకల్ నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు మూడు రోజుల క్రితం ఆందోళన నిర్వహించిన సంగతి విధితమే.
మూడు నాలుగు రోజులు పాటు నిరాఘవంటంగా సాగర నీటిని బోనకల్ బ్రాంచ్ కెనాలకు విడుదల చేస్తామని సీఈ శంకర్ నాయక్ హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. కానీ ఆ గడువు ముగియకముందే ఆదివారం సాయంత్రం నుంచే సాగర్ నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ విధంగా సాగర్ నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారి అన్నదాతలకు శాపంగా మారింది.
నీటిపారుదల శాఖ డిఈఈ శ్రీనివాస్ వివరణ...
బోనకల్ నీటిపారుదల శాఖ కార్యాలయానికి సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. బోనకల్ బ్రాంచ్ కెనాల్ కి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కానీ మండలంలోకి ప్రవేశించే సరికి 500 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుంది. ఈ నీటిలో 200 క్యూసెక్కుల నీటిని ఆంధ్ర ప్రాంతానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంపిస్తున్నారు. మిగిలిన 300 క్యూసెక్కుల నీరు మాత్రమే మండల రైతులకు సరఫరా చేయాల్సి ఉందన్నారు. దీని వల్లనే మండలంలో సాగర్ నీటి సమస్య ఏర్పడుతుందని అంగీకరించారు. సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉందన్నారు.