Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం తప్పనిసరి కాదంటా..!
- బీఆర్ఎస్ లోక్ సభా నాయకులు నామ నాగేశ్వరరావు
- లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఒక వైపు సింగరేణి బొగ్గు గనులను ప్రయివేటీకరిస్తూనే మరో వైపు అబ్బే అటువంటిదేమి లేదని తాను అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు తెలిపారు. దేశ వ్యాప్తంగా బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలు కేటాయించడం వాస్తవం కాదా ? ఇప్పటి వరకు సింగరేణి కంపెనీకి చెందిన ఎన్ని బొగ్గు బ్లాకులను ప్రయివేట్ కంపెనీలకు కేటాయించారు? సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలకు కేటాయించే ముందు తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించారా? అని నామ కేంద్రాన్ని లోక్ సభలో లిఖిత పూర్వకంగా ప్రశ్నించారు. దీనిపై కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇస్తూ సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలకు కేటాయించలేదని తెలిపారు. బొగ్గు గనుల చట్టం ( ప్రత్యేక నిబంధనలు ) - 2015లో నిబంధనల ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బొగ్గు గనులు కేటాయింపుదారుని ఎంపిక చేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఆ హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. మైన్స్, మినరల్ చట్టంలోని నిబంధనల ప్రకారం బొగ్గు బ్లాకుల కేటాయింపునకు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించడం తప్పనిసరి కాదని చెప్పడం గమనార్హం. ఒక వైపు తెలంగాణ రాష్ట్రంతో ముందస్తుగా ఎటువంటి సంప్రదింపులు జరపకుండానే సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిలా మాట్లాడడం. ఆశ్చర్యంగా ఉందని నామ పేర్కొన్నారు. రామగుండం సభలో ప్రధాని సింగరేణి బొగ్గు గనులను ప్రయివేటీకరించడం లేదని చెప్పి, ఆ తర్వాత సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణకు పూనుకోవడంతో యావత్ తెలంగాణ సమాజమంతా నిరసనతో ఎదురు తిరిగిన సంగతి తెలిసిందేనని నామ గుర్తు చేశారు. సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ హక్కులు ఉన్నాయని నామ స్పష్టం చేశారు. లక్షలాది మంది సింగరేణిపై ఆధారపడి జీవిస్తున్నారని, అటువంటి సంస్థను దొడ్డి దారిన ప్రైవేటీకరిస్తే మొత్తం తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని నామ స్పష్టం చేశారు. సింగరేణి జోలికి వస్తే సహించేది లేదని నామ పేర్కొన్నారు.