Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కాసాని
నవతెలంగాణ-కొత్తగూడెం
మంచికంటి రాంకిషన్ రావు జీవితం నేటి తరానికి ఆదర్శమని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య అన్నారు. బుధవారం స్థానిక మంచికంటి భవన్లో మంచికంటి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముందుగా మంచికంటి చిత్రపటానికి కాసాని పూలమాల వేసి నివాళులర్పించి, మాట్లాడారు. మంచికంటి తన జీవిత పర్యంతం ప్రజా జీవితాన్ని గడిపారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దళానికి నాయకత్వం వహించి ఆయుధాలు సమీకరణ చేసి దళానికి అందించారని అన్నారు. సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం గడిపారని, వరంగల్ జైలులో ఉన్నన్ని రోజులు కాళ్ళు చేతులకు సంకెళ్లు వేసి చీకటి గదిలో బందిచారని అన్నారు. అధిక ధరలకు నిరసనగా జరిగిన పోరాటంలో నాటి ప్రభుత్వం చిర్రావూరి, మంచికంటి కాళ్ళకు, చేతులకు సంకెళ్లు వేసి ఖమ్మం పురవీధుల్లో నడిపించారని తెలిపారు. అన్ని నిర్భందాలను ఎదుర్కొని కూడా కమ్యునిస్టు ఉద్యమాన్ని నిలబెట్టారని కొనియాడారు. రెండు సార్లు ఖమ్మం ఎమ్మెల్యేగా ప్రజా రంజక పాలన అందించారన్నారు. కొత్తగూడెం ప్రాంతంలో కార్మికోద్యమ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. తన తుది శ్వాస వరకు నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు నాయకుడుగా బ్రతికిన మంచికంటి జీవితం నేటి తరానికి ఆదర్శమని, ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్, భూక్యా రమేష్, యు.నాగేశ్వరరావు, వీరభద్రం, వీరన్న సందకూరి లక్ష్మి, రామ్ చరణ్, విజరు మోహన్ సింగ్, సలీం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ మంచి కంటి రామ కిషన్ రావు వర్థంతి సభను చంద్రుగొండ పార్టీ కార్యాలయంలో పార్టీ శాఖ కార్యదర్శి రాయి రాజా అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ ఉద్యమ నిర్మాతల్లో ఒకరు కామ్రేడ్ మంచి కంటి రామ్ కిషన్ రావు అన్నారు. ఆయన ఆశయాలు కొనసాగించడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు విప్పర్ల వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, పార్టీ సభ్యులు నాగుల్ మీరా, రాము, రబ్బాని, వెంకటేశ్వర్లు, తిరుపతయ్య, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.