Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ శంకర్ నాయక్
నవతెలంగాణ-కొత్తగూడెం
సమాచార హక్కుచట్టం ద్వారా ప్రజలు కోరిన సమాచారాన్ని సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజులలో అందించాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్ తెలిపారు. బుధవారం కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయంలో సమాచార హక్కుచట్టంపై వచ్చిన 25 ఫిర్యాదులపై పౌర సమాచార అధికారులతో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల జిల్లా అధికారులు, పౌర సమాచార అధికారులతో సమాచారహక్కు చట్టం విధులు, పరిధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారి తనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. సకాలంలో సమాచారం ఇవ్వని కారణంగా ప్రజలు నేరుగా కమిషన్ను సంప్రదిస్తున్నారని చెప్పారు. ప్రజలు, ఆయా శాఖల పౌర సమాచార అధికారులతో కేసులను విచారణ ప్రక్రియ నిర్వహించి కోరిన సమాచారాన్ని అందచేసినట్లు చెప్పారు. పౌరులకు సమాచారం అందచేయడంలో రాష్ట్ర కమిషన్ సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. కమిషన్కు వచ్చిన దరఖాస్తులను 3నెలలు నుంచి 6నెలల లోపు కేసు విచారణ చేపట్టి సమాచారం ఇప్పి యడంలో విజయవంతంగా ముందుకు వెళ్తునట్లు చెప్పారు. రాష్ట్ర సమాచార కమిషన్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. పౌర సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి వీలుగా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో కమిషన్ వేలాది కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. సమాచార హక్కుచట్టంపై ప్రజలకు, పాఠశాల స్థాయిలో విద్యార్థులకు చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రెవిన్యూ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, అటవీ, విద్యాశాఖలకు సంబంధించి ఎక్కువ వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సమాచారహక్కు చట్టం పరిధి, విధులపై జిల్లా అధికారులకు, పౌర సమాచార అధికారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏదైనా సమాచారం కోసం ప్రజలు నేరుగా తన ఫోన్ నెంబర్ 9908817986కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వంచే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని లబ్ధి పొందుతున్న సంస్థలు స్వచ్ఛందంగా పౌరులు అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, పౌర సమాచార అధికారులు తదితరులు పాల్గొన్నారు.