Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దారి కోసం రైతు సంఘం ఉద్యమం
నవతెలంగాణ-ముదిగొండ
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మండల పరిధిలో గోకినేపల్లి, వెంకటాపురం, చిరుమర్రి, సువర్ణాపురం, ముదిగొండ, వల్లభి గ్రామాల పరిధిలో రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లేందుకు గతంలో లింకు రహదారులు ఉన్నాయి. ఈ రహదారులు జాతీయ రహదారి విస్తరణతో మూసుకొని పోతున్నాయి. ఈ క్రమంలో పశువులు, మేకలు తోలుకొని పొలాలకు వెళ్లేందుకు రైతులు రహదారులను కోల్పోతున్నారు. దీంతో రైతులు పలు ఇబ్బందులకు గురవుతారు. ఈ రహదారులు మూసుకొని పోవడంతో జాతీయ రహదారి మీద నుండి పొలాలకు పశువులు, మేకలు, గేదెలను తోలుకొని వెళ్లాలంటే రైతులు పలు అవస్థలు గురికావాల్సి వస్తుంది. లింకు రహదారులు ఐదుచోట్ల కోల్పోవటంతో రైతులు ఆందోళనతో వేదనకు గురవుతున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ప్రధానంగా ముదిగొండ, వెంకటాపురం, గోకినేపల్లి రెవెన్యూ పరిధిలో 500 ఎకరాలను రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా వెంకటాపురం, చిరుమర్రి వెళ్లే లింకు రహదారి ఎన్ఎస్పి కాలువ ఆనుకొని బ్రిడ్జి నిర్మాణం నుండి అండర్పాస్ ఉంటే రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. ఈ లింకు రహదారి కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారి విస్తరణ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. గత నెలరోజుల నుండి ఉద్యమాన్ని చేపట్టి ఆందోళన నిర్వహిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం నుండి లింకు రహదారి నిర్మాణ పనులు చేపట్టొద్దని రైతులకు అండగా నిలబడి రైతు సంఘం పోరాటం నిర్వహిస్తుంది. లింకు రహదారి ఏర్పాటుకు, రైతు సంఘం, నాయకులు, రైతులు క్షేత్రస్థాయిలో లింకు రహదారి ప్రదేశాన్ని సందర్శించి పరిశీలించారు. గతంలో ఉన్న, ఈ పాత లింకు రహదారిని బ్రిడ్జి నుండి అండర్ పాస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ రహదారి కోసం రైతు సంఘం రైతులకు వెన్నుదన్నుగా పోరాటం చేపట్టింది. ఈ రహదారి కోసం రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి జిల్లా, మండల రైతు సంఘం నాయకులు మద్దతుగా నిలిచారు. రహదారి ఏర్పాటుకు తహసీల్దార్ శిరీషకు రైతు సంఘం నాయకులు వినతి మేరకు, ఇటీవల కాలంలో తాసిల్దార్ శిరీష లింకు రహదారిని క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. జాతీయ రహదారి విస్తరణ అధికారులతో మాట్లాడి రైతుల పొలాలకు వెళ్లేందుకు లింకు రహదారి ఏర్పాటు చేయాలని ఆమె చెప్పారు. బ్రిడ్జి నుండి అండర్పాస్ మంజూరుకు కృషి చేస్తానని రైతులకు ఆమె హామీ ఇచ్చారు. రైతులు చేస్తున్న ఈన్యాయమైన పోరాటానికి ప్రజల నుండి మద్దతు లభిస్తుంది. జాతీయ రహదారి విస్తరణ పనులు వలన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లింకు రహదారి ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం కోరుతుంది. లింకు రహదారి రైతులకు ఏర్పాటు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శ కందుల భాస్కరరావు, కోలేటి ఉపేందర్ హెచ్చరించారు.
రైతులకు లింకు రహదారి ఇవ్వాలి : రైతు సంఘం మండల కార్యదర్శి కోలేటి ఉపేందర్
జాతీయ రహదారి విస్తరణ పనుల ఎన్ఎస్పి కాల్వ బ్రిడ్జి నుండి రైతుల పొలాలకు వెళ్లేందుకు లింకు రహదారి ఏర్పాటు చేయాలి. గతంలో పాత రహదారి ఉంది. ఈ లింకు రహదారి మూసి వేయకుండా అండర్ పాస్ ఇవ్వకపోతే రైతులకు అండగా రైతు సంఘం రహదారి కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రహదారి మంజూరుకు అధికారులు కృషి చేయాలి. పంటల సాగుకు రైతులు పొలాల్లోకి వెళ్ళేందుకు ఉన్నదారినే మూసి వేయకుండా ఉంచాలి.