Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫారెస్టు అధికారుల కనుసన్నల్లోనే ఎంపిక
- గ్రామసభల తీర్మానాలకు అప్రాధాన్యత
- శాటిలైట్ సర్వే ప్రామాణికంగా పోడు పట్టాల జారీ
- అరకొర హక్కుపత్రాలతో సరిపుచ్చే యత్నం
- కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే
- కొందరికైనా..!
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా అటవీ హక్కు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. శాసనసభ ఎన్నికలకు నెలల సమయమే ఉండటంతో ఆగమేఘాల మీద పోడు పట్టాలు పంపిణీ చేసే చర్యలను ప్రభుత్వయంత్రాంగం ముమ్మరం చేసింది. అటవీశాఖ అధికారుల సూచనలే ఈ ప్రక్రియలో కీలకంగా మారాయనే చర్చ సాగుతోంది. ఫలితంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షన్నర ఎకరాల వరకు హక్కు పత్రాల కోసం దరఖాస్తులు రాగా 34,916 ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం 15 రకాల ఆధారాల ఆధారంగా హక్కుదారుల ఎంపిక జరగాల్సి ఉన్నా కేవలం శాటిలైట్ సర్వేను మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారని గిరిజన, ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గ్రామసభల తీర్మానాలు, గ్రామ పెద్దల డిక్లరేషన్, పోడు పోరాటాల సందర్భంగా నమోదైన కేసుల వంటివేవీ పరిగణలోకి తీసుకోకపోగా గిరిజన సంక్షేమ, రెవెన్యూశాఖల సూచనలను కూడా విస్మరించి కేవలం అటవీశాఖ నిర్ణయాన్నే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగానే నూటికి 40% మందికి కూడా పోడు పట్టాలు రావట్లేదని ఆయా సంఘాలు, పార్టీలు మండిపడుతు న్నాయి. దీనిలో గిరిజనేతరుల విషయంలోనూ కొంత అస్పష్టత నెలకొనడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల వరకూ దరఖాస్తులు వస్తే వీటిలో 5 లక్షల ఎకరాల పైనా పోడుదారులకు హక్కులు లభించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల వారీగా దరఖాస్తులను పరిశీలిస్తే...
ఖమ్మం జిల్లాలో...
జిల్లాలోని పది ఏజెన్సీ మండలాల్లోని 94 గ్రామపంచాయతీల్లో 194 ఆవాసాల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గిరిజనుల నుంచి 9,507 దరఖాస్తులు 25,515 ఎకరాల కోసం అందాయి. గిరిజనేతరుల నుంచి 8,980 దరఖాస్తులు 17,678 ఎకరాల కోసం వచ్చాయి. మొత్తంగా 18,487 దరఖాస్తులు 43,193 ఎకరాల హక్కుపత్రాల కోసం సమర్పించారు. క్షేత్రస్థాయి సర్వే, విచారణ అనంతరం గ్రామ సభలు నిర్వహించి, తీర్మానం చేశారు. దానిని డివిజన్‌స్థాయిలో ఎస్సీఎల్సీకి పంపారు. అక్కడ ఆమోదం తర్వాత జిల్లా స్థాయిలో అటవీహక్కుల కమిటీకి సిఫారసు చేసినట్లు పోడుభూముల ప్రత్యేక అధికారి డాక్టర్ యోగితా రాణా తెలిపారు. ఈ మేరకు గిరిజనుల నుంచి వచ్చిన 6,989 దరఖాస్తుల్లో 11,462 ఎకరాలు, అదనపు ప్యాచ్‌ల కోసం 2,598 దరఖాస్తులకు గాను 2,535.35 ఎకరాలు మొత్తంగా 13,997.67 ఎకరాలు స్వాధీనంలో ఉన్నాయి. గ్రామసభల్లో 6,795 దరఖాస్తులు, 2,556 అదనపు ప్యాచ్‌లు మొత్తంగా 13,656.95 ఎకరాలకు సిఫారసు చేశారు. జిల్లాస్థాయి సమావేశంలో వీటిలో 3,315 దరఖాస్తులకు గాను 4,359 ఎకరాలకు ఇప్పటి వరకు ఆమోదం లభించింది. మిగిలిన దరఖాసులనూ పరిశీలన చేసి పట్టాలు సిద్ధం చేస్తారు.
భద్రాద్రి కొత్తగూడెంలో...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇటీవల రెవెన్యూ, అటవీ, కమిటీ సభ్యులతో జిల్లాస్థాయి అటవీహక్కుల (డీఎల్సీ) సమావేశం నిర్వహించారు. 332 గ్రామపంచాయతీల పరిధిలోని 726 హ్యాబిటేషన్ల నుంచి జిల్లాలో దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుదారుల్లో ఎస్టీలు 65,616 మంది, గిరిజనేతరులు 17,725 మంది ఉన్నారు. పోటు భూములకు పట్టాల జారీ చేయాలనే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్ఏఎస్ఆర్ చట్టం ఆధారంగా ప్రతి హ్యాబిటేషన్లలో క్షేత్రస్థాయి పరిశీలన చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా కమిటీల సమావేశాల్లో చర్చించిన పిదప 11,532 మంది పోడుదారులకు 30,684.29 ఎకరాలకు పోడు పట్టాలు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. తొలి విడత విచారణ పూర్తయిన క్లైయిమ్స్ ఆధారంగా అర్హుల ఎంపిక చేపడుతున్నారు. కమిటీ సమావేశాల్లో సభ్యులు తెలిపిన అభ్యంతరాలను నమోదు చేశారు. తిరిగి విచారణ నిర్వహించి మిగిలిన క్లైయిమ్‌లపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
గ్రామసభ ఆమోదం పొందిన
దరఖాస్తుదారులందరికీ పట్టాలు ఇవ్వాలి...
భూక్యా వీరభద్రం, తెలంగాణ గిరిజన సంఘం
ఖమ్మం జిల్లా కార్యదర్శి
గిరిజన, ఆదివాసీ సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, ముఖ్యంగా సీపీఐ(ఎం) చేసిన పోరాట ఫలితంగా పోడుదారులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. గిరిజనేతరులకు హక్కుపత్రాలు ఇవ్వకపోగా... గిరిజనుల్లోనూ కొద్దిమందికే ఇస్తున్నారు. అశాస్త్రీయమైన శాటిలైట్ సర్వే ఆధారంగా పట్టాలు ఇస్తుండటంతో పోడుదారులనేకులు పట్టాలు పొందలేకపోతున్నారు. గ్రామసభ ఆమోదం పొందిన దరఖాస్తులన్నింటికీ పట్టాలు ఇవ్వాలనేది మా సంఘం ప్రధాన డిమాండ్. పోడుదారుల నుంచి బలవంతంగా లాక్కుని ప్రభుత్వం ప్లాంటేషన్ చేసిన భూములకూ హక్కుపత్రాలు ఇవ్వాలని కూడా మా సంఘం డిమాండ్ చేస్తోంది.