Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమి, బువ్వలేని పేదల పక్షాన పోరు
- వెలివాడ బతుకుల్లో ఎర్రజెండై నిలిచాడు
- ప్రజా ఉద్యమాల యోధుడు, ప్రజాప్రతినిధిగా రెండు దశాబ్ధాల చరిత్ర
- పేదల పెన్నిది నేడు గండ్లూరి 47వ వర్థంతి
నవతెలంగాణ-ముదిగొండ
భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం ఆనాడు జరిగిన వీరతెలంగాణ విప్లవ సాయుధ పోరాటానికి ముదిగొండ మండలం వేదికైంది. ఎందరో అమరవీరుల రక్తదర్పణంతో భూమి తడిసి పులకించింది. ఎర్రజెండై వెలిసి భూమి, బువ్వ కోసం జన సమరమై కొట్లాడారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో గ్రామీణ భూస్వామ్య దోపిడీ పీడనలపై రగిలిన అగ్నిజ్వాల, పేద ప్రజల జీవితాల్లో వెలుగు దివిటిల బాణాపురం గడ్డన ఉద్యమ బిడ్డ పురుడు పోసుకుంది. ఆపోరు బిడ్డే గండ్లూరి కిషన్‌రావు. తన జీవితమంతా కష్టజీవులు, కార్మికులు, వ్యవసాయ కూలీలతో, దళితులు, వెనుకబడిన వర్గాల వారితో గండ్లూరి చెలిమి చేశారు. గండ్లూరి కిషన్‌రావు పోరాట పటిమ పలువురికి ఆదర్శం. గండ్లూరి అమరత్వానికి నేటికి 47 ఏండ్లు. ఆదర్శకమ్యూనిస్టు జనం గుండె చప్పుడు గండ్లూరి ఆశయ సాధనకు పునరంకితం అవుదాం. ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసు కుంటూ గురువారం బాణాపురంలో గండ్లూరి 47వ వర్ధంతి సందర్భంగా నవతెలంగాణ ప్రత్యేక కథనం....
ముదిగొండ మండలం ఉద్యమాలకు పెట్టింది పేరు. అందులో బాణాపురం కమ్యూనిస్టు ఉద్యమాలకు పుట్టినిళ్లు. ఆ గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో 1926లో పుట్టిన గండ్లూరి కిషన్‌రావు ధనిక వర్గమైన ప్పటికీ భూమి, బువ్వలేని పేదల పక్షం నిలిచాడు. దున్నేవాడిదే భూమి అంటూ వంద లాది భూముల్లో ఎర్ర జెండాలు పాతి భూపోరాటాలు, రైతు కూలీ ఉద్యమాలు నిర్వహించారు. భూములు పంచారు. వ్యవ సాయ కార్మిక, కూలిరేట్ల పెంపు, అధిక వడ్డీలు, దోపిడీ, పెచ్చు మానికలు, కుల వివక్షతకు వ్యతిరేకంగా గండ్లూరి నాయకత్వాన ముదిగొండ మండలంతో పాటు నేలకొండపల్లి మండలంలో దళితులు, వెనుక బడిన వర్గాల ఐక్య ఉద్యమాలు నిర్వహించారు.
రావెళ్ల స్ఫూర్తితో గండ్లూరి ముందడుగు...
1959లో గ్రామ పంచాయతీలు ఏర్పడి తొలి సారిగా ఎన్నికలు జరగ్గా రావెళ్ల సత్యం స్ఫూర్తితో గండ్లూరి కిషన్‌రావు ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచారు. సర్పంచ్‌గా గ్రామ సేవలు చేస్తూ మర ణించేంత వరకు రెండు దశాబ్ధాల పాటు పని చేసిన ఘనత ఆయనదే. 1970 జిల్లా మార్కెటింగ్ ఉపాధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టి మార్కెటింగ్ ఉద్యోగులు, కార్మిక, కర్షక మన్ననలు పొందారు గండ్లూరి కిషన్‌రావు. ఆయనకు భార్య ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు వున్నారు. కాగా కుమారుడు రంగారావు(రంగప్ప) మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు.
ప్రజాఉద్యమాలకు వెన్నుదన్ను : ముదిగొండ మండలంలోని బాణాపురంలో పుట్టిన ఎర్రజండా ముద్దుబిడ్డా గండ్లూరి కిషన్‌రావు కూలీ...నాలీ పేదోల అండదండగా తలలో నాలికవలే పనిచేస్తున్న పోడు సమరంలో ఆయనకు ప్రజా ఉధ్యమాల నేతగా ఎదుగుతున్న తరుణంలో శత్రువర్గాల నుంచి భయంకంపిత ప్రకంపనాలు వస్తున్నా భయపడని ధీశాలి. ఎర్రజండా వెలుగుల నీడలో మెరిసే...మెరిపై..ఉరుమే...ఉరుమై ప్రజా ఉద్యమాలకు వెన్నుదండుగా నిలుస్తూ భూ స్వామ్య పెత్తందారుల వ్యతిరేక పోరాటాలు గండ్లూరి కొనసాగించారు. కార్మిక కర్షక రైతు కూలీలు కదంతొక్కుతూ ఉద్యమాలు జరుగుతున్న సమయంలో గండ్లూరికి అండదండగా బాణాపురం గ్రామానికి చెందిన అమరవీరులు, పోరాట యోధులు మొక్క చిన్ననర్సయ్య, ఆదేమ్మ, బొల్లెద్దు రామనాధం, పోతుల పుల్లయ్య, బాజీ హనుమంతు, గుండు చుక్కమ్మలు ఎర్రజండా నాయకత్వాన్న పోరాటాన్ని కొనసాగించారు. ఎర్రజండాకు మరింత వన్నెతెచ్చి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు.
ఓర్వలేక అరెస్టు : గండ్లూరి చేసే ఉద్యమాలు ఓర్వలేక ఆయనతో పాటు ఉద్యమకారులను అరెస్ట్ చేసి పోలీసులు లాకప్‌లో పెట్టారు. ఒకేలాకప్ గది కావడంతో ఎక్కువ మంది ఉద్యమకారులను నెట్టారు. దీంతో గండ్లూరి అట్టడుకు పడిపోయారు. మరుసటి రోజున ఆయన కుటుంబ సభ్యులు కిషన్‌రావును చూడ టానికి పోలీసు లాకప్ దగ్గరకు వెళ్ళగా ఆ సమయంలో గండ్లూరి కిందపడిపోయి ఉన్నారు. అంతేకాదు ఓ దళితుడి కాలు గండ్లూరి భుజంపై పడి ఉంది. ఆ సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోయిన కుటుంబ సభ్యులు ఇదేమి పరిస్థితి అని కుటుంబసభ్యులు వాపోయారు. దీంతో గండ్లూరి స్పందిస్తూ తరతరాలుగా మనం దళితులను తొక్కే స్తున్నాం. వాళ్ళు ఒక్కరోజు తొక్కేస్తే తప్పేం లేదని అనడం ఆయన దార్సికనీకతకు నిదర్శమని చెప్పుకో వచ్చు.
గండ్లూరి హత్య : ఇంతటి ప్రజా ఉద్యమాన్ని చూసిన కాంగ్రెస్ భూస్వామ్య శక్తులు కమ్యూనిస్టు నాయకులను అంతమొందిస్తేనే తప్ప మనుగడ లేదని అనుకొని భూస్వామ్య శక్తులు, గుండాలు గండ్లూరి కిషన్‌రావును సర్పంచ్ హోదాలోనే ఖమ్మం నుంచి ఇంటికి వస్తుండగా దారి కాచి 1976 ఫిబ్రవరి 9న అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఈ హత్యతో చలించిన రావెళ్ల సత్యం గండ్లూరిని చూసి బోరున విలపించారు. గండ్లూరి మరణానంతరం ఆయన భార్య నర్సుబాయి ఒక దశాబ్ధంపాటు బాణాపురం సర్పంచ్‌గా ఏకగ్రీవంగా పని చేశారు. గండ్లూరి అమరత్వం, వీరత్వం చూసిన ప్రజలు ఆయన మరణాన్ని తలు చుకుంటూ కంటతడి పెట్టారు. ఆయన మరణం దశాబ్ధాలు గడుస్తున్నా నేటికి ప్రజల గుండెల్లో నిలిచి గ్రామ నడిబొడ్డున స్థూపమై వెలుగుతున్నాడు. ఆయన వర్ధంతిని ప్రతి ఏటా ఫిబ్రవరి 9న బాణాపురం గ్రామంతో పాటు మండలంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు.