Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్ స్టేషన్ల ఎదుట రాస్తారోకో
- ఎస్ఈ హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ - బోనకల్
అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా అన్నదాతలు కన్నెర్ర చేశారు. ఎండిపోతున్న మొక్కజొన్న పంటను కాపాడాలంటూ అన్నదాతలు రావినూతల విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బుధవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం వైరా - జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై సబ్ స్టేషన్ ఎదురుగా అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. అప్రకటిత విద్యుత్ కోతను ఎత్తివేయాలని, 24 గంటల పాటు నిరంతరాయంగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అన్నదాతలు ఆందోళన నిర్వహించారు. మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన అన్నదాతలు పెద్ద ఎత్తున రావినూతల గ్రామంలో విద్యుత్ వ్యవసాయ మోటార్ల కింద మొక్కజొన్న పంటను సాగు చేశారు. సాగునీరు లేక మొక్కజొన్న పంట ఎండిపోతుంది. కళ్లెదుటే మొక్కజొన్న పంట ఎండిపోతుంటే కడుపు తరిగిపోయిన అన్నదాతలు ఆవేదనతో రావినూతలలోని విద్యుత్ సబ్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తాము సాగుచేసిన మొక్కజొన్న పంటను కాపాడాలంటూ పెద్ద ఎత్తున అన్నదాతలు నినాదాలు చేశారు. కొద్దిసేపు తర్వాత వైరా జగ్గయ్యపేట- ప్రధాన రహదారిపై సబ్ స్టేషన్ ముందే రాస్తారోకోకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విద్యుత్ సబ్ స్టేషన్ ముందు అన్నదాతలు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న మండల విద్యుత్ ఏఈ దొండేటి ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, రైతులు తమ సమస్యలను ఏఈ కి వివరించారు. విద్యుత్తు సమస్య వల్ల మొక్కజొన్న పంట ఎండిపోతుందని, వ్యవసాయానికి అప్రకటిత విద్యుత్ కోతను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. దీంతో ఏఈ వెంటనే ఎస్ ఈ సురేంద్రకు ఫోన్లో సమస్యను వివరించారు. దొండపాటి నాగేశ్వరరావు కూడా అప్రకటితో విద్యుత్ కోత వలన రైతుల ఎదుర్కొంటున్న సమస్యను సురేంద్రకు వివరించారు. దీంతో ఆయన స్పందిస్తూ రెండు మూడు రోజులలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై షెడ్యూల్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు తము ఆందోళన విరమించారు. కార్యక్రమంలో రైతులు బోయినపల్లి పెద్ద కొండ, యర్రగాని నాగేశ్వరరావు, షేక్ నాగుల మీరా, వట్టికొండ కృష్ణ, జోన బోయిన గోవిందు, పెంట్యాల రాజేష్, షేక్ జాని, షేక్ నాగులు, ముడావత నాగులు, గమిడి నరసింహారావు, షేక్ ఉస్మాన్, బోయినపల్లి అచ్యుత రావు, షేక్ బుజ్జి, యర్రగాని కొండలు, చేబ్రోలు సైదులు, మిర్యాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ : విద్యుత్ కోతలను నిరసిస్తూ సక్రమంగా విద్యుత్తును సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బాణాపురం, ముదిగొండ విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట వల్లభి- ముదిగొండ, కోదాడ-ఖమ్మం ప్రధాన రహదారిపై బుధవారం రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితిలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్ పేరుకు మాత్రమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేసిన మొక్కజొన్న పంటలు మోటర్లు నడవక ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. సమయపాలన లేకుండా విద్యుత్ పోవటంతో రైతులు పలు ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. రోడ్డుకి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అనంతరం విద్యుత్ అధికారులకు విద్యుత్ సరఫరాపై సమయానుకూలంగా సరఫరా చేయాలని వినతపత్రం అందజేశారు.