Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేపీసీ వేయాలని ప్రధాని సమక్షంలోనే నామ డిమాండ్
- సభ నుంచి పార్టీ ఎంపీలతో నామ వాకౌట్
- ఊహించని పరిణామంతో సీటులోనే కూర్చుండిపోయిన మోదీ
- బీఆర్ఎస్ పట్టుతో అట్టుడికిన పార్లమెంట్
- గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అదానీ అంశాన్ని తేల్చాల్చిందేనంటూ లోక్ సభలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని బీఆర్ఎస్ నాయకులు నామ నాగేశ్వరరావు పార్టీ ఎంపీలతో కలసి అడ్డుకోవడంతో లోక్ సభ దద్దరిల్లింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడేందుకు ప్రధాని మోదీ సిద్ధపడగా, ఉన్న పలంగా ఎంపీ నామ అదానీ అంశాన్ని ప్రధాని సమక్షంలోనే గట్టిగా లేవనెత్తారు. కీలకమైన అదానీ హిండెన్ బర్గ్ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలని, సభలో చర్చించాలని నామ బిగ్గరంగా అరుస్తూ ప్రధానిని డిమాండ్ చేసి, పట్టుబట్టారు. కాగా నామ మాట్లాడుతున్న సమయంలో ప్రధాని మోదీ సీటులోనే కూర్చుండిపోయారు. దీంతో స్పీకర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నామ పార్టీ ఎంపీలతో కలసి సభ నుంచి వాకౌట్ చేసి, బయటకు వెళ్ళిపోయారు. ఊహించిన పరిణామంతో స్పీకర్ వెంటనే బీఆర్ఎస్ ఎంపీలను అడ్డుకోవడం గమనార్హం. కాగా అదానీ వ్యవహారంపై బుధవారం పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ ఎంపీలు పెద్ద ఎత్తున చర్చకు పట్టుబట్టడడంతో పాటు సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలనే డిమాండ్‌తో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. బీఆర్ఎస్ ఎంపీలు ఈ అంశాన్ని తీవ్రంగా లేవనెత్తారు. తొలుత ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాల కోసం నోటీసులు అందజేశారు. వాటిపై చర్చకు కేంద్రం నిరాకరించడంతో ఉభయ సభల్లో బీఆర్ఎస్ ఎంపీలు విపక్షాలతో కలిసి, ఆందోళన చేశాయి. అదానీ అంశంపై మోదీ సర్కార్ నోరు మెదపకపోవడంతో బీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రం వైఖరికి నిరసనగా నిరసన వ్యక్తం చేసి, ఉభయ సభలను వాకౌట్ చేసి, బయటకు వచ్చారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులతో ఆందోళన నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా అదానీ - హిండెన్ బర్గ్ నివేదిక అంశంపై చర్చ కోరుతూ ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు అందజేస్తూ చర్చకు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లోక్ సభ నాయకులు నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ అదానీ హిండెన్ బర్గ్ వ్యవహారంపై సత్వరమే సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించి, విచారించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ, వెనుకడుగు వేస్తుందన్నారు. కేంద్రం తీరుకు నిరసనగానే ఉభయ సభలను వాకౌట్ చేశామన్నారు. అదానీ అంశంపై చర్చ జరిపేంత వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాము ప్రజా ప్రతినిధులమని, ప్రజలకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, అందుకే అదానీ అంశంపై చర్చకు పట్టుబడుతున్నామని నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.