Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
- సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం
- ఏప్రిల్లో పథకాన్ని మళ్లీ మొదలెడతాం
- పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని
నవతెలంగాణ-సత్తుపల్లి
గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గొల్లకురుముల సమస్యలపై మాట్లాడారు. గొర్రెల పంపిణీ పథకం గురించి సండ్ర ప్రభుత్వానికి కూలంకుశంగా వివరించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ పథకాన్ని పొందేందుకు చాలా మంది లబ్ధిదారులు డీడీలు కట్టారని సభలో ప్రస్తావించారు. కొద్దికాలం క్రితమే సత్తుపల్లి మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అవతరించింది. సత్తుపల్లి మున్సిపాలిటీగా మారిన తరువాత ఆయా డీడీలను వెనక్కి పంపారన్నారు. దీంతో సత్తుపల్లి గొల్లకురుమలలో ఆందోళన నెలకొందన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీగా మారినప్పటికీ ఇంకా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అనేకం ఉన్నాయన్నారు. కావున అందరి సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని డీడీలు స్వీకరించాల్సిందిగా సండ్ర విజ్ఞప్తి చేశారు. కేవలం సత్తుపల్లిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైన సమస్యను అనేక మంది లబ్ధిదారులు ఎదుర్కొంటున్నారన్నారు. అందరికి న్యాయం జరిగేలా చర్యలు ఎప్పటిలోగా తీసుకుంటారో సభ ద్వారా తెలియజేయాల్సిందిగా ఎమ్మెల్యే సండ్ర ప్రభుత్వాన్ని కోరారు.
స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
ఎమ్మెల్యే సండ్ర గొల్లకురుములపై వెలిబుచ్చిన సమస్యపై పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ముఖ్యమంత్రి ఓ గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారని, వాటిలో తప్పులు దొర్లకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే డీడీలు కట్టిన వారే కాకుండా రాష్ట్రంలో మిగిలిన గొల్లకురుమ సోదరులు కూడా డీడీలు కట్టవలసిందిగా కోరారు. తప్పనిసరిగా అందరికి పథకాన్ని వర్తింపజేసి కచ్చితంగా మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో పథకాన్ని ప్రారంభించి నాలుగైదు నెలలోనే పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.