Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలకు రైతులను బలిచ్చే విధంగా ఉందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య అన్నారు. గురువారం చండ్రుగొండ సెంటర్లో బడ్జెట్ కాగితాలను తగలబెడుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో ఎరువులు సబ్సిడీ 70 వేల కోట్ల రూపాయల తగ్గించటం, వ్యవసాయ పరిశోధనలకు నిధులు కేటాయించకపోవడం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూసి వేయాలనే ఆలోచనతో కేంద్ర బడ్జెట్లో కేవలం లక్ష రూపాయలు మాత్రమే కేటాయించారని, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ద్వారా పత్తి ధర క్వింటాళ్లకు 12 వేల నిర్ణయించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అనుబంధ రంగాలకు నిధులు కేటాయింపు కోత పెట్టడం ద్వారా రైతులను కార్పొరేట్ కంపెనీల కోసం బలి చేసే విధానాన్ని అనుసరిస్తుందన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పత్తి కొనుగోలు చేసే సంస్థను పూర్తిగా ఎత్తి వేసేందుకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారని అన్నారు, ఈ సీజన్లో అధిక వర్షాల వల్ల పత్తి దిగుబడి తగ్గి ధర లేక రైతులు ఆత్మహత్యలుకు పాల్పడుతూ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత నుంచి విస్మరించిందని అన్నారు. క్వింటాలకు 12 వేల రూపాయలు ధర నిర్ణయించి సిసిఐ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ విధానం రైతులకు అనుకూలంగా ఉందని ప్రచారం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో పంటల భీమా పథకానికి నిధులు కేటాయించకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కొండపల్లి శ్రీధర్, రైతు సంఘం జిల్లా నాయకులు మామిళ్ళ వెంకటేశ్వర్లు, సంఘం మండల కార్యదర్శి ఐలూరి రామిరెడ్డి, సర్పంచ్ కాకా సీత, వ్యవసాయ కార్మిక సంఘం సంఘం మండల కార్యదర్శి పెద్దిని వేణు, రాయి రాజా, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, దాసరి సీతారాములు, నాగులు మీరా, అబ్దుల్ రెహమాన్ కాక హనుమంతరావు పాల్గొన్నారు.