Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గండ్లూరి కిషన్ రావు వర్ధంతి సభలో పొన్నం
నవతెలంగాణ-ముదిగొండ
భూస్వామ్య పెత్తందార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నాడు సాగిన ప్రజాపోరులో పేద ప్రజల వెట్టి చాకిరి విముక్తి చేసి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన గండ్లూరి కిషన్ రావు కమ్యూనిస్టు త్యాగధనుడని సిపిఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో బాణాపురంలో సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో గండ్లూరి కిషన్‌రావు 47 వర్ధంతి గురువారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాణాపురం ప్రాంతంలో పేదవర్గాలపై భూస్వామ్య దాడులను ఎదుర్కొని గండ్లూరి కిషన్‌రావు అగ్రభాగాన నిలిచి పెచ్చుమానికలకు వ్యతిరేకంగా పాలేరులా వేతనాలు, కూలి రేట్ల కోసం ఉద్యమించారన్నారు. గ్రామంలో ప్రజా ప్రతినిధిగా ప్రజలకు, పార్టీకి అనేక సేవలందించారన్నారు. సిపిఐ(ఎం) జిల్లా నాయకులు మాదినేని రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైనదన్నారు. గండ్లూరి స్ఫూర్తితో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను ఉధృతం చేయాలన్నారు. అనంతరం గండ్లూరి స్తూపం వద్ద పుష్పగుచ్చాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, నాయకులు వేల్పుల భద్రయ్య, పాలవాయి పాండురంగారావు, కూరపాటి శ్రీనివాసరావు, వత్సవాయి సైదులు, టీఎస్ కళ్యాణ్, కోలేటి ఉపేందర్, కందిమల్ల తిరుపతి, చింతకాయల రామారావు, మేడి రవి, ఎం.శ్రీను, వి.నరసింహా రావు, ఎం.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.