Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఏకకాలంలో స్థలాలు ఇవ్వాలి..
- ఇళ్ల స్థలాల కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
- జర్నలిస్టులపై కేంద్రప్రభుత్వ దాడులను అరికట్టాలి..
- సిద్ధిఖీ కప్పన్ పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకోవాలి..
- టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు పల్లా కొండలరావు, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విధివిధానాలు ఖరారు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పల్లా కొండలరావు, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఏకకాలంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరారు. స్థానిక సుందరయ్య భవనంలో గురువారం నిర్వహించిన యూనియన్ జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం పూనుకోవడం హర్షనీయమని జిల్లా కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు కృషి చేసిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ డిపిఆర్ఓ గౌస్ పాషాలకు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం పోరాడిన సిపిఐ (ఎం) జిల్లా కమిటీ, రాష్ట్ర మహాసభలలో తీర్మానం చేసిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘానికి సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. ముగ్గురు ముఖ్యమంత్రుల సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారంగా నెల రోజుల లోపులోనే పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండడం విశేషమని పేర్కొన్నారు. అయితే ముందుగా ఇళ్ల పట్టాలకు సంబంధించిన విధివిధానాలపై స్పష్టతనిస్తే జర్నలిస్టుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసిన వారవుతారని తెలిపారు. జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తుండడాన్ని సమావేశం ఖండించింది. హత్రాసులో దళిత బాలికను చెరిచి చంపిన అమానవీయ దాడిపై రిపోర్టింగ్ చేయడమే జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ నేరమైందన్నారు. ఉపా చట్టం కింద దాదాపు రెండేళ్ల పాటు జైళ్లో మగ్గిన సిద్దిఖీ కప్పన్ ఇటీవల విడుదలవడం హర్షనీయమన్నారు. క్రూరమైన చట్టాలకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని కప్పన్ ప్రకటించడం విశేషం అన్నారు. ప్రశ్నించిన జర్నలిస్టులను కేంద్రం క్రూరమైన చట్టాలు పేరుతో అరెస్టు చేయడం సహేతుకం కాదన్నారు. సమావేశంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు విష్ణు, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, సీహెచ్ నారాయణ, కోట రవికుమార్, శ్రీధర్, కె.శివారెడ్డి, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.