Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాస్తవాలు గమనించాలి
- కాలానుగుణంగా వస్తున్న మార్పుల కోసం జర్నలిస్టులకు శిక్షణ అవసరం
- దేశంలో ఏ రాష్ట్రాల్లో లేని విధంగా జర్నలిస్టులకు సంక్షేమం
- తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశం, రాష్ట్రంలో కొన్ని సంస్థలు పనికట్టుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నయని, మత విద్వేషాలు రెచ్చగోడుతున్నాయని, ఫేక్ న్యూస్ ప్రపంచం నుండి జర్నలిస్టులు బైటికి రావాలని, వాస్తవాలను గుర్తించి వార్తా కథనాలు రాయాలని, జర్నలిజంలో కాలానుగుణంగా వస్తున్న మార్పుల వలన జర్నలిస్టులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామని, దేశంలోని ఇతర ఏ రాష్ట్రాల్లో లేని విధంగా జర్నలిస్టులకు సంక్షేమం పథకాలు తెలంగాణ మీడియా అకాడమి అందిస్తుందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు రోజుల పాటు వృత్తి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. స్థానిక సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మెన్ మాట్లాడారు. పాత్రికేయుల శిక్షణ, సంక్షేమం కోసం మీడియా అకాడమీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. జర్నలిజం ప్రత్యేకమైన వృత్తి అని, నిలబడి ముందుకు సాగాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్తున్న అనేక మార్పుల కారణంగా పాత్రికేయులు ఆలోచన చేయాల్సి ఉన్నదని చెప్పారు. ఈ శిక్షణా కార్యక్రమాలు ద్వారా పాత్రికేయులు విధి నిర్వహణలో మరింత నైపుణ్యాన్ని సాధించాలని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాత్రికేయుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించించారని చెప్పారు. ఇప్పటి వరకు రూ.42 కోట్లు మంజూరు చేసారని, వాటిలో రూ.17 కోట్లు పాత్రికేయుల సంక్షేమానికి వినియోగించినట్లు చెప్పారు. ఇంకా రూ.58 కోట్లు మంజూరు కావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన 490 మంది పాత్రికేయుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా రూ.1లక్ష ఆర్ధిక సాయం మంజూరుతో పాటు, ప్రతి నెలా రూ.3 వేల పింఛను, చదువుకునే పిల్లలకు రూ.1వేయి ఉపకార వేతనాలు మంజూరు చేసినట్లు చెప్పారు. కరోనా కష్టకాలంలో 5 వేల మంది పాత్రికేయులకు రూ.7 కోట్ల సాయం అందించినట్లు వివరించారు. కరోనా వంటి బయానక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులను ఆదుకున్నదని ఇదంతా ప్రభుత్వం గుర్తించడం వల్ల సాధ్యమైనట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డులు ద్వారా 6 సంవత్సరాలలో రూ.33 కోట్ల విలువైన వైద్య సేవలు పాత్రికేయులు వినియోగించుకున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం వచ్చిన సందర్భంలో పాత్రికేయులకు ఇండ్లస్థలాలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఖమ్మంలో ఇంటి స్థలాలు పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, రానున్న అతికొద్ది రోజుల్లో అన్ని జిల్లాలలో పాత్రికేయులకు ఇంటిస్థలాలు మంజూరు అవుతాయని స్పష్టం చేశారు. కొత్తగూడెంలో కూడా రూ.17 ఎకరాల్లో ఇంటి స్థలాలు ఇవ్వడానికి గుర్తించారని చెప్పారు. ఆధునిక జర్నలిజంపై పాత్రికేయులకు సమగ్రమైన అవగాహన అవసరమని చెప్పారు. పాత 10 జిల్లాలలో 8 వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. నూతన జిల్లాలు ఏర్పాటు తదుపరి అన్ని జిల్లాలలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు మీడియా అకాడమీ ద్వారా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నాణ్యమైన వార్తలు ప్రజలకు చేరవేయడంలో శిక్షణా కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయని చెప్పారు. షోషల్ మీడియా నుండి బైటికి వచ్చి వార్తలు రాయాలని కోరారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజానికి మనం వార్తలను అందించాలని చెప్పారు. అనుభవంతో పాటు వృత్తిలో నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న పాత్రికేయంలో పోటీతత్వంతో వాస్తవాలను ప్రజలకు తెలియచేయడంలో ముందుండాలని చెప్పారు. జర్నలిస్టులు తెలంగాణ పోరాటంలో ఉదృతంగా పాల్గొన్నారని, అస్తిత్వంతో పోరాడారని, అనేక శక్తులతో కలిసి నడిచామని, ఉద్యమ సమయంలో ఇది కాదనలే సత్యమని చెప్పారు. చైతన్యాన్ని ప్రదర్శించింది పాత్రికేయులేనని చెప్పారు. అనంతరం సోషల్ మీడియా ధోరణులు అనే అంశంపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ సుధాకర్ రెడ్డి, గ్రామీణ వార్తలు అనే అంశంపై సీనియర్ పాత్రికేయులు రమణారావులు పాత్రికేయులకు క్లాసులు బోధించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం మున్సిపల్ ఛైర్మన్ కాపు సీతాలక్ష్మి, టియుడబ్ల్యుజె రాష్ట్ర కార్యదర్శి మారుతీ సాగర్, సీనియర్ పాత్రికేయులు యోగానంద్, విష్ణువర్ధన్, టియుడబ్యూజె జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాసరావు, ఖమ్మం అధ్యక్షులు ఆదినారాయణ, వట్టికొండ రవి, సీహెచ్.నరసింహారావు, చండ్ర నరసింహరావు, షఫి, బాలయోగి, అకాడమీ మేనేజర్ వెంకటేశ్, ఓఎస్డీ రహమాన్, వనజ, జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన మీడియా అకాడమీ ఛైర్మన్‌కు డిపిఆర్ శీలం శ్రీనివాస్ మొక్కను బహుకరించి శాలువాతో ఘనంగా సత్కరించారు.