Authorization
Thu April 10, 2025 10:23:23 am
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-ములకలపల్లి
పోడు సాగు దారుల హక్కు పత్రాల ఎంపికలో పారదర్శకత ఉండాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన సాగుదారులు 8363 మంది దరఖాస్తులు పరిశీలించి అందరికీ భూమిపై హక్కు పత్రాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్సీ కమిటీ ఆధ్వర్యంలో, సాగుదారుల సమక్షంలో గ్రామసభలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోడుకు శాశ్వత పరిష్కారం చూపుతామన్న సీఎం ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అదేసమయంలో లబ్ధిదారుల ఎంపికలో గోప్యితతో అనుమానాలకు తావిస్తుందని లబ్ధిదారులు ఎంపిక గ్రామసభలో తీర్మానం చేయాలని అన్నారు. అధికారుల అత్యుత్సాహంతో పోడు భూమిని కోల్పోయేవారు అధికంగా ఉంటారని అన్నారు. ప్రభుత్వం చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో అధికారుల చర్యలకు పొంతనలేదని అన్నారు. అధికారుల చర్యల వలన గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులకు, సాగుదారులకు మధ్య ఘర్షణ జరిగే ప్రమాదం ఉన్నదని అన్నారు. పోడుకు పరిష్కారం దొరికే సందర్భంలో పోడు సాగుదారుల పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ అధికారుల చర్యల వలన సర్వే ఆగిపోయిన, సర్వే చేయ్యని పోడు కేంద్రాలలో సర్వే నిర్వహించి వెంటనే హక్కు పత్రాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో గ్రామసభ ఆమోదం పొందిన దరఖాస్తుదారులను తిరస్కరించే హక్కు అధికారులకు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, వూకంటి రవికుమార్, నిమ్మల మధు, పోడియం వెంకటేశ్వర్లు, గోపగాని లక్ష్మీ నరసయ్య, గౌరీ నాగేశ్వరరావు, గోగ్గల ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.