Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్‌తో తాటి భేటీ
- హాత్ సే హాత్ యాత్రలో రేవంత్
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఏండ్ల తరబడి అన్యాయానికి గురవుతున్న ఆదివాసీలకు న్యాయం జరిగేవరకు వారికి అండగా ఉండాలని, వారు సాగుచేసుకుంటున్న పోడు భూమి ప్రతి ఎకరాకు పట్టాలు వచ్చే వరకు పోరాడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఇల్లందు నియోజవర్గంలో సాగుతున్న హాత్ సే హాత్ యాత్రలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు ఏజెన్సీ ప్రాంత సమస్యలు, ఆ ప్రాంతం ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు కాసేపు చర్చించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి త్వరలో అశ్వారావుపేట నియోజకవర్గంలోనూ పర్యటిస్తానని తాటికి హామీ ఇచ్చారు. ఆదివాసీలకు అండగా కాంగ్రెస్ ఎప్పుడూ ఉంటుందని భరోసా కల్పించాలని కోరారు. నియోజకవర్గంలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రజలకు నాయకత్వం వహించాలని సూచించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఒక్కటే పరిష్కారం అన్నారు. పార్టీ శ్రేణులు అన్ని అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏకతాటిపైకి వచ్చి కలిసికట్టుగా ప్రజల్లో పని చేయాలని కోరారు.