Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుర్తింపు కార్డులు ఇవ్వాలి
- ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి
- సీఐటీయూ జిల్లా అధ్యక్షలు బ్రహ్మాచారి
నవతెలంగాణ-చర్ల
మిషన్ భగీరథ మంచినీటి పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి డిమాండ్ చేశారు. సీఐటీయూ అనుబంధ తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ చర్ల మండల సమావేశం విద్యాసాగర్ అధ్యక్షతన బిఎస్ రామయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశంలో కే.బ్రహ్మచారి మాట్లాడారు. మిషన్ భగీరథ కార్మికులకు అరకొర వేతనాలతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తుందని విమర్శించారు. కార్మికులం దరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లను తొలగించి ప్రభుత్వమే నేరుగా ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రతి కార్మికుడికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అమలవుతున్న రూ.10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీని మిషన్ భగీరథ కార్మికులకు అమలు చేయాలని, అందుకు అవసరమైన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని, పని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడు రోజుకి ఐదు నుంచి 15 కిలోమీటర్లు మంచినీటి సరఫరా పైపులైను వెంట విధులు నిర్వహిస్తున్నారని, అందుకు అయ్యే రవాణా ఖర్చులు జీతంలో సగం ఖర్చు అవుతున్నాయని కాబట్టి రవాణా ఖర్చులు అదనంగా ప్రభుత్వం చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మిషన్ భగీరథ కార్మికుల సమస్యల పైన మొదటి నుండి సీఐటీయూ సమశీలంగా పోరాడుతుందని పోరాటం వల్లనే రూ.5000 ఉన్న కార్మికుల వేతనాలు నేడు రూ.11500 పెరిగాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.11500ను 26 వేల పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులందరూ ఐక్యంగా పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ అండతోటి మిషన్ భగీరథ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసమే ఇటీవల సిఐటియు ఆధ్వర్యంలో జనవరి 31న ఎస్సీ కార్యాలయం ముందు ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదులో ఈఎన్సీ ఆఫీస్ ముందు భారీ ధర్నా నిర్వహించడం జరిగిందని, ధర్నా సందర్భంగా ప్రభుత్వం కొన్ని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిందని, వాటి అమలు కోసం అన్ని మండలాల్లో మిషన్ భగీరథ కార్మికులు సమిష్టిగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షులు సోడి పృథ్వి, సీఐటీయూ మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, మిషన్ భగీరథ కాంట్రాక్టు యూనియన్ నాయకులు కిషోర్, సాయి, ప్రశాంత్, నవీన్, అరుణ్ బాబు, కనితి రాజేష్, కృష్ణ ప్రసాద్, సంతోష్, రవివర్మ, ఎం.సురేష్, వాసు తదితరులు పాల్గొన్నారు.