Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభకు హాజరైన ప్రముఖులు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్లో అరుణ్ సాగర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం అరుణ్ సాగర్ పురస్కారాల ప్రదానోత్సవ సభ జరిగింది. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అరుణ్ సాగర్ జీవన సాఫల్య పురస్కారంను సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, అరుణ్ సాగర్ విశిష్ట సాహితీ పురస్కారమును ప్రముఖ కవయిత్రి, రచయిత కుప్పిలి పద్మకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశమును ఉద్దేశించి...తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.... రచయితగా, కవిగా, జర్నలిస్టుగా అరుణ్ సాగర్ శైలిని ప్రశంసించారు. జర్నలిజంలో అరుణ్ సాగర్ నూతన వరవడిని సృష్టించారని తెలిపారు. ఆయన మన మధ్య లేని లోటు తీరనిది అని అన్నారు. ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ... అరుణ్ సాగర్ చేసిన రచనలు అద్భుతం అని ప్రశంసించారు. సమాజ హితం కోరే ఎన్నో కథనాలు వెలువరించారని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ... జర్నలిజం విలువలను పెంపొందించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమన్నారు. ప్రముఖ వాగ్గేయకారులు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మాట్లాడుతూ.... తెలంగాణ జర్నలిస్టు చరిత్రలో అరుణ్ సాగర్ చిరస్మరణీయుడుగా గుర్తుండిపోతారని అన్నారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ గంట చక్రపాణి మాట్లాడుతూ...ఆయన రచనలు ఎప్పుడు మనసును తట్టి లేపే విధంగా ఉన్నాయని వెల్లడించారు. తన రచనల్లో ఎల్లప్పుడూ పేదోడి పైనే ఆలోచన ఉండేదని తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రచనలు సాగేవని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కే.శ్రీనివాస్, సాక్షి పత్రిక సంపాదకులు వర్ధిల్లి మురళి తదితరులు మాట్లాడుతూ.... పత్రిక రంగానికి అరుణ్‌సాగర్ చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్ సాగర్ ట్రస్ట్ సభ్యులు జగన్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.