Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి హామీ తక్షణమే అమలు చేయాలి
- మంత్రి చొరవ చేయాలి
- సీపీఐ(ఎం) నియోజకవర్గ కన్వీనర్ మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో నివాసం ఉంటూ జర్నలిస్టు వృత్తిలో కొనసాగుతున్న వారందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ భద్రాచలం పట్టణ విస్తృత సమావేశం ఎం.బి నర్సారెడ్డి అధ్యక్షతన చందర్రావు భవన్ భద్రాచలంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల టీఆర్ఎస్ రాష్ట్ర ఆవిర్భావ సదస్సు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని ప్రకటించారని, రాష్ట్ర మంత్రి పదవితో ఖమ్మం పట్టణంలో విలేకరులకు ఇంటి స్థలాలు ఇవ్వటానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కథనాలు ఉన్నాయని, కేవలం ఖమ్మం పట్టణనికే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జర్నలిస్టులుగా వృత్తి నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాలని సీపీఐ(ఎం) కోరుతుందని అన్నారు. 2017లోనే ముఖ్యమంత్రి ప్రకటన చేశారని ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని ఇప్పటికైనా కార్యరూపం కాల్చాలని కోరారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వటం ద్వారా వారిని ఆదుకున్న వారు అవుతారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గ్రామీణ పట్టణ విలేకరులకు అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో జాప్యం చేయవద్దని అలా జరిగితే జర్నలిస్టులందరితో కలిపి ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై.వెంకట రామారావు, పి.సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు డి.సీతాలక్ష్మి, బి.కుసుమ, యు.జ్యోతి, జీవనజ్యోతి, జీ.లక్ష్మీకాంత్, ఎన్.నాగరాజు పాల్గొన్నారు.