Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.తిరుపతయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది ప్రజావ్యతిరేక బడ్జెట్ అని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.తిరుపతయ్య అన్నారు. స్థానిక కొత్తగూడెం యూటిఎఫ్ టీచర్స్ భవన్లో ''కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు, వివిధ వర్గాల ప్రజలపై ప్రభావం'' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌కు పట్నం జిల్లా కన్వీనర్ కొండపల్లి శ్రీధర్ అధ్యక్షత వహించారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి.తిరుపతయ్య ప్రధాన వక్తగా హాజరై మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ 2023-24, కరోనా విపత్తు వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మందగించిన సమయంలో ప్రవేశపెట్టినదని, రెండు సంవత్సరాలు కరోనా విపత్తు మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిందని, ప్రపంచం అంతటా ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతున్న ప్రతికూల వాతావరణంలో ఈ బడ్జెట్ ఉద్యోగాల కల్పనతో ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఉండాలన్నారు. దేశీయ డిమాండ్ వృద్ధి రేటు పెంచే విధంగా ఉండాలని, ఆ పరిస్థితిని కల్పించడంలో ఈ బడ్జెట్ విఫలమైందని విమర్శించారు. దీనికి విరుద్ధంగా, ఇది ధనవంతులకు మరింత పన్ను రాయితీని ఇస్తూనే ద్రవ్య లోటును తగ్గించడానికి ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తూ, ప్రజలకు కల్పించే సబ్సిడీల కోత విధించిందన్నారు. భారతదేశంలోని 1 శాతం సంపన్నులు గత 2 సంవత్సరాలలో మొత్తం సంపదలో 40.5 శాతాన్ని పోగేసుకున్నారని ఆక్స్‌ఫామ్ నివేదికలు చెబుతున్నాయని అన్నారు. ఇది ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందనీ, ఈ బడ్జెట్ దేశంలో అత్యధికుల జీవనోపాధిపై దాడి చేసే విధంగా ఉందన్నారు. నిరుద్యోగ రేటు చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగిందనీ, బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కేటాయింపులను 33 శాతం తగ్గించారనీ, ఆహార సబ్సిడీపై రూ.90,000 కోట్లు, ఎరువుల సబ్సిడీపై రూ.50,000 కోట్లు, పెట్రోలియం సబ్సిడీ రూ.6,900 కోట్లు కోత విధించారన్నారు. కోవిడ్ విపత్తు విధ్వంసం సృష్టించినప్పటికీ ఆరోగ్య రంగానికి గతేడాది కేటాయించిన రూ.9255 కోట్లు ఖర్చు చేయలేదని, అదేవిధంగా విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్లో రూ.4,297 కోట్లు ఖర్చు చేయలేదన్నారు. 16 శాతం ఎస్సీ జనాభాకు బడ్జెట్ 3.5 శాతం, 8.6 శాతం ఎస్టీ జనాభాకు 2.7 శాతం మాత్రమే నిధులు కేటాయించారన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే మాటలు ఒట్టి బూటకం అన్నారు. ప్రజలకు అవసరమైన ఉపశమనాన్ని కల్పించడానికి, ఆర్థిక రంగం గాడినపడేందుకు తోడ్పడే దేశీయ డిమాండ్‌ను పెంచడానికి పలు సూచనలు చేసారు. ఉద్యోగ సృష్టి సంబంధిత ప్రాజెక్టుల్లో పెట్టుబడులను గణనీయంగా పెంచాలని, ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కేటాయింపులను భారీగా పెంచాలని, 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలతో పాటు, 5 కిలోల సబ్సిడీ ఆహార ధాన్యాలను అందించాలని, ఆహార, మెడిసిన్ సహా నిత్యావసర వస్తువులపై జీఎస్టీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లోనూ నిధుల కేటాయింపుల్లో వేరువేరు వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని, ప్రభుత్వం హామీ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి వంటి పథకాలకు నిధులు కేటాయించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్నం రాష్ట్ర నాయకులు ప్రసాద్, ఐలూ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్, ఎల్ఐసీ నాయకులు శ్రీనివాసన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, ఐద్వా జిల్లా కార్యదర్శి మందలపు జ్యోతి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న, యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ఎస్.వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు విక్కి బాలరాజు, కాళంగి హరికృష్ణ, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ భూక్యా రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి కూరపాటి సమ్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అలేటి కిరణ్, జెవివి నాయకులు కస్తూరి, సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రాజారావు, ఐద్వా జిల్లా సహయ కార్యదర్శి సందకూరి లక్ష్మీ, మెడికల్ హెల్త్ యూనియన్ నాయకులు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.