Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారంలోకొస్తే రూ.500లకే సిలిండర్
- ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు
- పీఆర్సి అమలు చేస్తాం..కార్మిక సమస్యలు తీరుస్తాం
- టీపీసీసీి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-మణుగూరు
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పోడు భూముల పట్టాలు ఇస్తామనడంలో అనుమానాలు ఉన్నాయని, నమ్మకం లేదని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మణుగూరు అంబేద్కర్ సెంటర్లో బహిరంగ సభలో మాట్లాడుతూ 2006లో అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చి పది లక్షల భూములు పంచింది కాంగ్రెస్ అని అన్నారు. 11 లక్షల పోడు భూముల దరఖాస్తులకు పట్టాలి ఇవ్వడంలో అనుమానాలు ఉన్నాయన్నారు. పోడు భూములు పట్టాలు ఇప్పిస్తామని పార్టీని మారిన 12 మంది ఎమ్మెల్యేలు దొరల గడిలో గడ్డి మేస్తున్నారని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, 370 ఆర్టికల్, త్రిపుల్ తలాక్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ పంచన అంట కాగి, ఓడిపోతున్న భయంతో కాంగ్రెస్ దోస్తీ కోసం చంద్రశేఖర రావు నానా గడ్డి కరుస్తుంది అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోడుపట్టాలిస్తామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. పిఆర్సి అమలు చేసి ఆర్టీసీ విద్యుత్తు తదితర కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలంటే ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఐదు వేల కోట్లు. ఆరోగ్యశ్రీ 800 కోట్లు కాంగ్రెస్ కే సాధ్యమన్నారు. రేగా కాంతారావు ఇసుక, ఇటుక, వైన్ భూదందా, పార్టీ ఫిరాయింపుల దందా, ఫామ్ హౌస్ల దందా నిర్వహిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమతో నిర్మించుకున్న పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకోవడం దుర్మార్గమన్నారు. నూతన సంవత్సరంలో నూతన ప్రభుత్వం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. రేగా కాంతారావును అరెస్ట్ చేయిస్తామన్నారు. నేడు తెలంగాణ సమాజం సమస్యలతో కొట్టుమిట్టాడుతుందన్నారు.
రాజ్య హింస పెరిగిందన్నారు. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ప్రజల ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. బీటీపీఎస్, సింగరేణి, గోదావరి వరద బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని వారు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోరిక బలరాం నాయక్, పోదెం వీరయ్య, సీతక్క, సిరిసిల్ల రాజయ్య, తాటి వెంకటేశ్వర్లు, చందా లింగయ్య, కాటిపోయిన నాగేశ్వరరావు, బట్ట విజయ గాంధీ, శ్రీవాణి, పిరినాకి నవీన్, నవీన్ బాబు, గురజాల గోపి తదితరులు పాల్గొన్నారు.