Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మకు టీఎస్ యూటీఎఫ్ వినతిపత్రం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పదోన్నతులు, బదిలీల సీనియారిటీ జాబితాలను నిబంధనల ప్రకారం తప్పులు లేకుండా రూపొందించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీ నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అనేకసార్లు పదోన్నతులు నిరాకరించిన వారిని జాబితా నుండి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ ఆఫ్ లైన్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బదిలీలు, పదోన్నతుల అంశాలపై జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మకు వినతిపత్రం సమర్పించారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పదోన్నతులు నిర్వహిస్తే మల్టీజోన్ -1లో 1000వ ర్యాంకు ఉన్న అభ్యర్థి వెబ్ ఆప్షన్స్ పెట్టడం కష్టతరమని పేర్కొన్నారు. కావున పదోన్నతులు ఆఫ్‌లైన్‌లో (ప్రత్యక్ష కౌన్సెలింగ్ విధానం) నిర్వహించాలని కోరారు. బదిలీల, పదోన్నతుల సీనియారిటీ జాబితాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి తప్పులు దొర్లకుండా రూపొందించాలని తెలిపారు. అర్హులు నష్టపోకుండా చూడాలని కోరారు. గతంలో రెండు, మూడు సార్లు పదోన్నతులను నిరాకరించిన ఉపాధ్యాయులను సీనియారిటీ జాబితా నుండి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించాలని, వివిధ డీఎస్సీల మెరిట్ లిస్టులు సంఘాలకు అందుబాటులో ఉంచాలని కోరారు. బదిలీలలోని వివిధ అంశాలపై ఉన్న సందేహాలను నివత్తి చేయాలని, అవసరమైతే పాఠశాల విద్య డైరెక్టర్‌కు నివేదించి స్పష్టత ఇప్పించాలని సూచించారు. టీఎస్ యూటీఎఫ్ ప్రాతినిధ్యం చేసిన అంశాలపై జిల్లా విద్యాశాఖాధికారి సానుకూలంగా స్పందించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు షమీ, నాయకులు ఎస్.సతీష్, వి.రాంబాబు, వి.శ్రీనివాసరావు, ఎం.నరసింహారావు, నర్సింహులు, ఝాన్సీ తదితరులు ఉన్నారు.