Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఆర్టీసీ పరిరక్షణ కోసం అన్ని సంఘాలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
- ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వజ్రాల శ్రీనివాసరావు
నవతెలంగాణ-ఖమ్మం
ఆర్టీసీ కార్మికులకు హయ్యర్ పెన్షన్ విషయంలో, ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్‌కు ఆర్టీసీ కార్మికులు ఎంత చెల్లించాలి, కార్మికులకు వచ్చే పెన్షన్ ఎంత అనే విషయంలో ఆర్టీసీ యాజమాన్యం స్పష్టత నివ్వాలని తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(సిఐటీయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రాల శ్రీనివాసరావు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఖమ్మంలోని మంచికంటి హాల్ బాణాల రాంబాబు అధ్యక్షతన రీజినల్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు అమలు చేయవలసిన రెండు వేతన సవరణలు, స్క్రాప్ బస్సులో స్థానంలో కొత్త బస్సులు కొనడానికి సహకారం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి సహకరించాలని కోరారు. యాజమాన్యం పెంచిన కిలోమీటర్లు, పనిభారాలు తగ్గించాలని, కార్మికులపై వేధింపులు ఆపాలని, ప్రయాణికుల అవసరాల మేరకు బస్సుల సంఖ్యను పెంచాలని, అన్ని రూట్లలో బస్సులు నడపాలని కోరారు. తెలంగాణ ఆర్టీసీ రక్షణ కోసం ఆర్టీసీ లోని కార్మిక సంఘాలన్నీ సమైక్య పోరాటానికి సిద్ధం కావాలని, కేంద్ర ప్రభుత్వ రవాణా విధానం మూలంగా ఆర్టీసీలు నష్టాల పాలవుతున్నాయని అందువల్ల దేశవ్యాప్తంగా ఆర్టీసీల రక్షణ కోసం జరుగుతున్న ఆందోళనలో భాగంగా మార్చి నెల 12 నుండి 19వ తేదీ వరకు జరిగే ఆర్టీసీ పరిరక్షణ వారాన్ని జయప్రదం చేయాలని, ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. ఖమ్మం రీజయన్ లో సర్వీసులు పెంచడం ద్వారా ఖమ్మం రీజియన్ నుండి ఇతర రీజియన్ లకు బదిలీపై వెళ్ళిన డ్రైవర్లు, కండక్టర్లు అందరినీ తిరిగి ఖమ్మం రీజియన్ కు రప్పించాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో భారత కార్మిక సంఘాల కేంద్రం(సిఐటియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయని, రాబోయేది ఎన్నికల కాలమని, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడం, రావలసిన వేతన సవరణలు, పని పరిస్థితులను మెరుగుపరాల్సిన బాధ్యత ప్రభుత్వానికి తప్పకుండా ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో, పెరిగిన పని భారాలతో ఇబ్బంది పడుతున్న కార్మికుల్ని వెతుక్కుంటూ నాయకులు వచ్చే కాలం వస్తుందని,అప్పటివరకు కార్మిక వర్గానికి ఆర్టీసీ నాయకత్వం ధైర్యం చెప్పాలన్నారు. పోరాటాల జిల్లా ఖమ్మం రీజియన్ లో స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి గడ్డం లింగమూర్తి మాట్లాడుతూ ఆందోళన, అశాంతితో ఉన్న కార్మికులకు భరోసా ఇవ్వాలని వారికి అండగా ఉండాలని రాష్ట్ర జెఎసి పిలుపుల్ని ఖమ్మం రీజయన్లో సంఘాల సమన్వయంతో మరింత జయప్రదం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రీజనల్ లోని ఆరు డిపోల కార్యదర్శిలు డిపోలలో పని పరిస్థితులు తెలియజేస్తూ పెరిగిన పని భారాలతో కార్మికులు తీవ్రమైన ఆందోళన,అసంతప్తితో ఉన్నారని సమావేశం దృష్టికి తెచ్చారు. యాజమాన్యం నియమించిన సంక్షేమ మండళ్ళు కార్మిక సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవని అన్నారు. ఖమ్మం రీజియన్ కార్యదర్శి పిట్టల సుధాకర్ మాట్లాడుతూ డిపో కమిటీలన్నీ సమస్యలను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలని కార్మిక వర్గానికి అండగా ఉండాలని సూచించారు. ఖమ్మం డిపో కార్యదర్శి గుండు మాధవరావు సంతాప తీర్మానం పెట్టగా మౌనం పాటించి మృతులకు నివాళులర్పించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లంశెట్టి వెంకటేశ్వర్లు, రీజియన్ కోశాధికారి ఎస్.కే.పర్వీన్, ప్రచార కార్యదర్శి తోకల బాబు, నాయకులు వేము జాకబ్, కుడుదల వెంకన్న, చింతలచెరువు వెంకట కృష్ణారెడ్డి, కూరపాటి రామారావు, భూక్య బాలకృష్ణ, మహిళా కన్వీనింగ్ కమిటీ నాయకులు ఎస్.రమాదేవి, డి.సరిత, క.పద్మ, బుగ్గవీటి లింగమూర్తి, గుర్రం రామారావు,షేక్ నసీరుద్దీన్, పగిళ్లపల్లి నరసింహారావు, సిరిపురపు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.