Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా సరఫరా జరగాలి
- అవకతవకలకు పాల్పడిన డీలర్ల పై క్రిమినల్ కేసులు
- అంగన్వాడి కేంద్రాల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలి
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
సంక్షేమ హాస్టల్లో, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఆహార భద్రత చట్టం ప్రకారం విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందని కమిటీలో చర్చించిన అంశాలను తప్పక పాటించాలని చెప్పారు. కమిటీ విధులను కలెక్టర్ వివరించారు. ఆహార భద్రత చట్టం ప్రకారం సంక్షేమ హాస్టల్‌తో పాటు ప్రభుత్వ ఆహారం అందించే అన్ని శాఖల విజిలెన్స్ కమిటీ పరిధిలోకి వస్తాయని చెప్పారు. నాణ్యతతో పాటు బియ్యం సక్రమంగా పంపిణీ జరిగే విధంగా కమిటీ సభ్యులు బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. రేషన్ బియ్యం తీసుకోవడానికి బయోమెట్రిక్ రాని లబ్ధిదారుల జాబితా తయారుచేసి ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సమస్యను పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల అధికారిని ఆదేశించారు. బయోమెట్రిక్ రాని వారికి సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా బియ్యం పంపిణీ చేయాలని చెప్పారు. సాంకేతిక పరమైన సమస్యలుంటే కమిషనర్ దృష్టికి తెచ్చి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అవకతవగలకు పాల్పడిన డీలర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రేషన్ దుకాణాలను సీట్ చేయాలని చెప్పారు. చౌక దుకాణాల తనిఖీపై ప్రతి సోమవారం పౌరసరఫరాల శాఖ డీటీలు నివేదికలు అందజేయాలని చెప్పారు. సంక్షేమ అధికారులు వసతి గృహాలను తనిఖీ చేయాలని మెనూ పాటిస్తున్నారా లేదా పరిశీలన చేయాలని చెప్పారు. విజిలెన్స్ కమిటీ సభ్యులు హాస్టల్లు తనిఖీ చేయాలని చెప్పారు. నూతన రేషన్ కార్డులు జారీ కోసం పౌరసరఫరా శాఖ కమిషనర్‌కు నివేదిక పంపాలని చెప్పారు. పాఠశాలలు సంక్షేమ హాస్టలలో స్టాకు పరిశీలిన చేయాలని నిరంతరం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. హాస్టళ్లకు నిత్యవసర వస్తువులు సరఫరాకు ప్రింటర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లకు సరుకులు సకాలంలో సరఫరా చేయాలని సక్రమంగా సరఫరా చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని అదరపు కలెక్టర్‌కు సూచించారు. ఏడు అంగన్వాడీ ప్రాజెక్టుల్లోని 1058 అంగన్వాడీ కేంద్రాలకు చిరుధాన్యాలు అందజేస్తున్నామని చిరుధాన్యాలు సరఫరాపై నివేదిక అందజేయాలని సంక్షేమ అధికారిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పట్టకుండా అర్హులకు అందాలని చెప్పారు. కమిటీ సభ్యులు చేసిన సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్ గాను, అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్ గాను, జిల్లా పౌరసరఫరాల అధికారి కన్వీనర్ జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థలు సభ్యులు తదితరులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారి మల్లికార్జున్, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, జెడ్పి సీఈవో విద్యలత, సంక్షేమ అధికారి లేనీన, పౌరసరఫరాల శాఖ డిఎం శ్రీనాథ్ బాబు, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, గిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవి, డీఈఓ ప్రసాద్, తునికల కొలతల అధికారి మనోహర్, డీటీ భాష, బీసీ సంక్షేమ అధికారి సురేందర్, దివ్యాంగుల సంక్షేమ సంఘ అధ్యక్షులు సతీష్, రేషన్ దుకాణాల డీలర్ సంఘం అధ్యక్షులు శేఖర్ బాబు, కమిటీ సభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు, యు.కృష్ణ, జి.కుసుమ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.