Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
కార్మిక వర్గం కోసం, పేద ప్రజల కోసం తమ జీవితాలను అంకితం చేసి పోరాడిన నాటి అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకోసం నేటితరం కమ్యూనిస్టు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యులు, స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు దేవూరి శేషగిరిరావు 75వ వర్ధంతి, మాజీ ఎంపి, సాయుధపోరాట యోధులు బొమ్మగాని దర్మభిక్షం 101వ జయంతిని బుధవారం శేషగిరిభవన్లో ఘనంగా నిర్వహించారు. తొలుత నేతల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులిర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ సింగరేణి ప్రధాన కార్యాలయంలో సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన శేషగిరిరావు నాడు నాటి బ్రిటీష్ తెల్లదొరల కార్మికుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలకు శ్రీకారం చుట్టారన్నారు. బొగ్గుగనుల్లో మహిళలు, పిల్లలతో పనిచేయించే విధాన్ని వ్యతిరేకించిన తొలితరం ఉద్యమకారుడు శేషగిరిరావు అని కొనియాడారు. శేషగిరావుతోపాటు ఆయనతో సహచరులు రంగయ్య, పాపయ్యలు అప్పటి రజాకార్లు బూర్గంపాడు ప్రాంతంలో కాల్చి చంపారని పేర్కొన్నారు. సమాజానికి ఎంచేయాలనుకున్నాడో దాన్ని నెరవేర్చేందుకు విద్యార్థి దశ నుంచి స్వాతంత్య్రం అనంతరం వరకు జరిగిన విరోచిత తెలంగాణ పోరాటంలో ధర్మబిక్షం ప్రముఖపాత్ర పోషించాడని, ఎమ్మెల్యేగా, ఎంపీగా నిస్వార్ధంగా ప్రజాసేవ చేశాడని అదేవిధంగా రాష్ట్ర వ్యాపితంగా గీత కార్మికుల హక్కులకోసం నిర్విరామంగా కృషి చేశాడని కొనియాడారు. ఋ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, దమ్మాలపాటి శేషయ్య, వాసిరెడ్డి మురళి, వట్టికొండ మల్లికార్జున్‌రావు, వంగా వెంకట్, కె.రత్నకుమారి, పుట్టి భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, అక్తర్ తదితరులు పాల్గొన్నారు.