Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎం కో- ఆర్డినేషన్, సేవా సమితి ఉపాధ్యక్షులు ఎం.సురేశ్ అభినందనలు
- ఎగ్జిబిషన్లో రూ.5 లక్షల విలువైన సేవా ఉత్పత్తుల విక్రయం
నవతెలంగాణ-కొత్తగూడెం
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో జరిగిన 82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో సింగరేణి సేవా సమితి కొత్తగూడెం ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి ఉత్పత్తుల స్టాల్‌కు ద్వితీయ బహుమతి లభించింది. 2500 స్టాళ్లను ఏర్పాటు చేయగా ఇందులో కార్పోరేట్ విభాగంలో సింగరేణి సేవా సమితి స్టాల్‌కు ద్వితీయ బహుమతి లభించడం విశేషం. బుధవారం ఎగ్జిబిషన్ ముగింపు నేపథ్యంలో అత్యుత్తమ స్టాళ్లకు ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ అవార్డులను ప్రకటించింది. స్టాల్ డెకరేషన్, వస్తు విక్రయ తీరు, ప్రచారం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని సింగరేణి సేవా సమితి స్టాల్‌ను అవార్డుకు ఎంపిక చేసినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు ప్రదానం చేసిన ఈ బహుమతిని అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, సీనియర్ పీవోఎస్.శ్రీకాంత్‌లు జీఎం కో-ఆర్డినేషన్, సింగరేణి సేవా సమితి ఉపాధ్యక్షులు ఎం.సురేశ్‌కు సింగరేణి భవన్లో అందజేశారు. దాదాపు18 ఏళ్లుగా నాంపల్లి ఎగ్జిబిషన్లో సింగరేణి సేవా సమితి మహిళలు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వీలు కల్పిస్తోందని తెలిపారు. 45 రోజుల పాటు జరిగిన నాంపల్లి ఎగ్జిబిషన్లో సింగరేణి లోని 10 ఏరియాలకు చెందిన మహిళలు పాల్గొన్నారని, దాదాపు రూ.5 లక్షల విలువైన క్లాత్ బ్యాగులు, మగ్గంతో తయారు చేసిన వస్త్రాలు, ఇతర వస్తువులను విక్రయించారని తెలిపారు.