Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కళాశాల ఎ.డి మాధవి
నవతెలంగాణ - అశ్వారావుపేట
విద్యార్థులు చదువుతూ ఆటల్లో పాల్గొనాలని, క్రీడా స్పూర్తి మేధస్సును పెంచుతుందని కావున చదువు, ఆటలు రెండు కళ్లు గా భావించినప్పుడే ఆ విద్యార్థి అన్ని రంగాల్లో రాణించగలుగుతారని వ్యవసాయ కళాశాల ఏడీ డాక్టర్ ఎ.మాధవి అన్నారు. ఇటీవల హైదరాబాదు రాజేంద్రనగర్ లో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అంతర్ కళాశాలల క్రీడా పోటీ ల్లో అశ్వారావుపేట కళాశాల విద్యార్ధులు ఓవరాల్ చాంపియన్,వ్యక్తిగత ఛాంపియన్ షిప్స్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ చాలామంది క్రీడల్లో రాణించకపోవడానికి కారణం భయం అన్నారు. ఒక్కసారి బరిలో దిగాక ఎదురుగా ఎవరున్నారు అనేది ఆలోచించకుండా క్రీడా స్ఫూర్తితో ఆడటమే విజయానికి సోపానం అని అన్నారు. అశ్వారావుపేట కళాశాల నుంచి వందమంది విద్యార్థులు పలు రకాల క్రీడల్లో పాల్గొనగా 110 బహుమతులు ఈ కళాశాలకు దక్కడం నిజంగా అభినందనీయం అని అన్నారు. ఇటీవల జరిగిన పీజీ పరీక్షల్లో సైతం అశ్వారావుపేట విద్యార్థులు అగ్రభాగాన ఉన్నారన్నారు. శాస్త్రవేత్తల నియామకాల్లోనూ అశ్వారావుపేట విద్యార్థులే ఉన్నారు. ఇది మనందరికీ, విశ్వవిద్యాలయానికి గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అందుకున్న ట్రోఫీలు, బహుమతులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల శాస్త్రవేత్తలు గోపాలకృష్ణమూర్తి, మధుసూదనరెడ్డి, నీలిమ, నాగాంజలి, పీడీ రెహమాన్, సిద్దప్ప, శిరీష పాల్గొన్నారు.