Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి మండలం రేజర్లలో వేంచేసిన గుట్ట సత్తెమ్మతల్లి అమ్మవారి తిరునాళ్లను ప్రతియేటా మూడు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో గత 26 యేండ్లుగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 50 యేండ్లకు పైగా రేజర్ల గుట్టనుంచి ఈ ప్రాంతంలోని రోడ్లు, ఇతర పనులకు మట్టి, కంకరను తరలించుకునే క్రమంలో అమ్మవారి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో గుట్ట కింద భాగంలో రోడ్డు పక్కగా రాతితో గుట్టసత్తెమ్మతల్లి అమ్మవారిని ప్రతిష్టించి చిన్నపాటి పందిరి వేసి పూజలు జరుపుకుంటూ వస్తున్నారు. రేజర్ల గ్రామస్తులు అమ్మవారికి గుడి కట్టించాలని సంకల్పించుకొని గుడి నిర్మాణాన్ని పూర్తిచేసి నవంబరు 17, 1996వ సంవత్సరంలో గుడిని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో తిరునాల మహౌత్సవాలను మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. ఈనెల 13నుంచి ప్రారంభమైన అమ్మవారి తిరునాళ్లు బుధవారం అర్థరాత్రితో ముగిశాయి.
సత్తెమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్న సండ్ర...
రేజర్లలో గత మూడు రోజులుగా జరుగుతున్న గుట్టసత్తెమ్మతల్లి తిరునాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బుధవారం సందర్శించారు. అనంతరం ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సండ్ర ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దొడ్డా శంకరరావు, ఎస్కే రఫీ, అంకమరాజు, భీమిరెడ్డి గోపాల్‌రెడ్డి, చింతల సురేందర్‌రెడ్డి, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డి (ఎర్రబాబు), గొర్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు.