Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 86 మంది మల్టీ పర్పస్ వర్కర్ల ఎదురుచూపులు
- పంచాయతీ నిధులపై ప్రభుత్వం ఫ్రీజింగ్
- ట్రెజరీలో మూలుగుతున్న చెక్కులు
- 45 మంది ఉద్యోగానికి గుడ్ బై
నవతెలంగాణ-బోనకల్
గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు రెండు నెలలుగా జీతాలు బంద్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులపై ఫ్రీజింగ్ విధించడంతో చెక్కులు ట్రెజరీ కార్యాలయంలో మూలుగుతున్నాయి. దీంతో గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ల కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతాలు రాక పలువురు ఉద్యోగులు మానేశారు. జీతాలు విడుదల చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
మండలంలో 22 గ్రామపంచాయతీలు ఉండగా ప్రారంభంలో 131 మంది మల్టీపర్పస్ వర్కర్లు పనిచేస్తున్నారు. ప్రతినెల మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు ఇచ్చేందుకు గ్రామపంచాయతీలో నిధులు మాత్రం ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులపై ప్రీజింగ్ విధించడంతో ట్రెజరీలో రెండు నెలలుగా పంచాయతీలో చెక్కులు మూలుగుతున్నాయి. కానీ అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ నిధుల విత్ డ్రా పై ఫ్రీజింగ్ విధించడంతో సకాలంలో జీతాలు అందగా అనేక గ్రామపంచాయతీలలో కొంతమంది మల్టీపర్పస్ వర్కర్లు ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగాలకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుత 22 గ్రామపంచాయతీలో 86 మంది మాత్రమే మల్టీపర్పస్ వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. జీతాలు సక్రమంగా అందక 45 మంది మల్టీపర్పస్ వర్కర్లు ఉద్యోగాలకు గుడ్ బై చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఫ్రీజింగ్ తో నిధులు విడుదల కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే కుండలో బువ్వ కుండల్లోనే ఉండాలి పిల్లవాడు మాత్రం దుడ్డుగా ఉండాలి అనే సామెత లాగా ఉందని పలువులు మట్టి వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర జీతాలతో విధులు నిర్వహిస్తున్నామని అవి కూడా రెండు నెలలగా జీతాలు ఇవ్వటం లేదని ఇలా అయితే తమ కుటుంబాలు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీలు మాత్రం ప్రతినెలా క్రమం తప్పకుండా మల్టీపర్పస్ వర్కర్ల వేతనాలకు సంబంధించి బిల్లులు చేస్తూ చెక్కులు విత్ డ్రా చేసేందుకు ట్రెజరీ కార్యాలయాలకు పంపిస్తున్నారని, కానీ ట్రెజరీ కార్యాలయం అధికారులు మాత్రం నిధుల విత్ డ్రా పై రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిందని తాము చెక్కులు విత్ డ్రాకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. ట్రెజరీ కార్యాలయంలో చెక్కులు పెండింగ్ లో ఉండటంతో సర్పంచులు, కార్యదర్శులు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రతిరోజు వెట్టిచాకరీ చేస్తున్నామని అయినా పూట గడవని పరిస్థితులు ఏర్పడ్డాయని మల్టీపర్పస్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చే అరకొర వేతనాలు కూడా నెలల తరబడి ప్రభుత్వం ఇవ్వకుండా ఫ్రీజింగ్ విధిస్తే తమ కుటుంబాలు ఎలా జీవించాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రతి నెల జీతాల కోసం ఎదురుచూస్తున్నాం : అంతోటి రమేష్ మల్టీ పర్పస్ వర్కర్, బోనకల్
ప్రతిరోజు రాత్రి పగలు అనక వెట్టిచాకిరి చేస్తున్నామని కానీ జీతాల కోసం మాత్రం ప్రతినెల ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రతిరోజు కూలికి వెళితే రోజుకు 300 రూపాయలు వస్తున్నాయని కానీ తమకు ఇచ్చేది రూ. 8500 మాత్రమేనని అన్నారు. పనికి సమయం సందర్భం ఉండదన్నారు. తమకు ఇస్తున్న అరకొర జీతాలు కూడా ప్రతి నెల సక్రమంగా ఇవ్వడం లేదు. దీంతో తాము ప్రతిరోజు కుటుంబ పోషణ కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం వెంటనే ఫ్రీజింగ్ ఎత్తివేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
పంచాయతీల్లో జాప్యం లేదు : ఎంపీవో వ్యాకరణం వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
మల్టీపర్పస్ వర్కర్ల జీతాలకు సంబంధించి ప్రతినెల గ్రామపంచాయతీలు చెక్కులు ట్రెజరీ కార్యాలయానికి పంపిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులపై ఫ్రీజింగ్ విధించడం వలన సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్నాం. గ్రామపంచాయతీలో ఎటువంటి జాప్యం లేదు. ప్రభుత్వ నిర్ణయాల ప్రకారమే తాము విధులు నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు.