Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎల్ఏ రాములునాయక్
నవతెలంగాణ-వైరా
రాజకీయాలలో వ్యక్తులను నమ్ముకుని ప్రయాణించే వారికి భవిష్యత్ ఉండదని ఎమ్మెల్యే లావుడీయా రాములు నాయక్ హెచ్చరించారు. శుక్రవారం వైరా ఇండోర్ స్టేడియం ఆవరణలో జరిగిన ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం కెసిఆర్ జన్మదిన కార్యక్రమం వైరాలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య బల ప్రదర్శనగా మారింది. ఎమ్మెల్యే వర్గం వైరా, కొణిజర్ల మండలాల నుండి కార్యకర్తలను సమీకరించి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం రహదారిపై నియోజకవర్గ చివరి గ్రామం తనికెళ్ళ నుండి ర్యాలీ నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. ర్యాలీ వైరా చేరుకున్న తర్వాత స్టేడియం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ ఆటలు తెలంగాణాలో సాగకుండా అడ్డుకునేందుకు బిఆర్ఎస్, కమ్యూనిష్టులు కలిసి ప్రయాణించే సమయంలో కొందరు బిఆర్ఎస్ పార్టీని వీడి వ్యక్తులుగా ఉన్న వారి వెంట వెళ్ళటం దురదృష్టకరమని అన్నారు. సహజంగా తమ లాంటి వారు తెలివి తక్కువ వారిమని, అందుకే రిజర్వేషన్లతో రాజకీయాలలోకి వచ్చామని, కాని రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగి రాజకీయ పదవులు, అధికారం అనుభవిస్తున్న వారు సహితం వ్యక్తులను నమ్మి పార్టీని వీడటం మంచిది కాదని అన్నారు. ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వైరా ఎంపీపీ వేల్పుల పావని, కొణిజర్ల జడ్పిటిసి పోట్ల కవిత, మునిసిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బిడికె రత్నం, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్ రావు, దిశా జిల్లా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జున రావు, జడ్పి కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ అహమ్మద్, ముసలిమడుగు ఎంపీటీసీ శీలం వెంకట రామిరెడ్డి, చేరుకుమల్లి రవి, కొణిజర్ల మండల పార్టీ అధ్యక్షులు చిరంజీవి, మునిసిపల్ కౌన్సిలర్స్, బిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి అమర్నేని మాధవరావు. వివిధ గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.