Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
మహాశివరాత్రి సందర్భంగా తీర్థాలలో నిర్వహించే జాతరకు భక్తులు వేలాదిగా తరలివస్తారని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా దైవదర్శనం కల్పించాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అధికారులకు సూచించారు.మండల పరిధిలోని తీర్ధాల సంగమేశ్వర ఆలయంలో జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన పనులు సక్రమంగా పూర్తిచేశారా లేదా అని ఆరా తీశారు. ఆలయ ప్రాంగణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కోసం రూ.2.80లక్షలు వితరణగా అందజేశారు. ఎవరికీ ఎటువంటి పాస్లు జారీ చేయకుండా భక్తులంతా దైవదర్శనం చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. పారిశుద్ధ్య పనులు ఎప్పటికపుడు చేపట్టాలని సూచించారు.వీఐపీలు వచ్చినా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. రహదారుల వెంట లారీలు, ట్రాక్టర్లు ఇతర వాహనాలు నిలవకుండా చూడాలన్నారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ..131 ఎకరాల్లో 36 చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు.ఆర్టీసీ బస్సులకు ఆలయం వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించామని, బస్సులలో వచ్చే వారు నేరుగా ఆలయం వద్దకు చేరుకోవచ్చన్నారు. ప్రజలంతా పోలీసు వారికి సహకరించాలని కోరారు. తహసీల్దారు సుమ మాట్లాడుతూ...మంచినీటి సమస్య లేకుండా జాతరలో 40 వాటర్ ట్యాంకులతో తాగునీటి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు క్యూలైన్లో చలువ పందిళ్ళు, స్విమ్మర్లు, అన్ని శాఖల వారికి స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, సీఐలు శ్రీనివాస్, అంజలీ, ఆలయ ఈఓ శేషయ్య, అన్ని శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.