Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ సిబ్బందిని అడ్డుకున్న అన్నదాతలు
- గ్రామపంచాయతీ కార్యాలయంలో 'విద్యుత్ సిబ్బంది' నిర్బంధం
- ఆందోళనతో రైతులకు తిరిగి ఇచ్చిన 'ఆటోమేటిక్ రిలే'
- పండుగ రోజే అన్నదాతలపై ప్రభుత్వం వేధింపులు
నవ తెలంగాణ - బోనకల్
వ్యవసాయ విద్యుత్ మోటార్ల ఆటోమేటిక్ రిలే విద్యుత్ సిబ్బంది శనివారం రైతులకు తెలియకుండా అక్రమంగా తొలగించారు. ఈ విషయం తెలిసిన అన్నదాతలు తమ తమ విద్యుత్ వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్లారు. అప్పటికే విద్యుత్ సిబ్బంది ఆటోమేటిక్ రిలేలను తొలగిస్తున్నారు. దీంతో అన్నదాతలు తొలగించడానికి వీలులేదని అడ్డుకున్నారు. అయినా విద్యుత్ సిబ్బంది ఆగకపోవడంతో సిబ్బంది మొత్తాన్ని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. రైతుల ఆందోళనతో తిరిగి ఆటోమేటిక్ రిలేలను రైతులకు అప్పగించారు. ఈ సంఘటన మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
రైతుల తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణపల్లి బోనకల్ బ్రాంచ్ కెనాల్, వైరా ప్రాజెక్టుకు చివరి గ్రామం. దీంతో సాగునీటి సమస్య ఈ గ్రామానికి అనేక ఏళ్ల నుంచి తీవ్రంగా ఉంది. దీంతో అన్నదాతలు వ్యవసాయ విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 100 విద్యుత్ మోటార్ల కింద 500 ఎకరాల సాగు భూమి అవుతుంది. ప్రతి ఏడాది మొక్కజొన్న, వరి తదితర పంటలను అన్నదాతలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్నదాతలు నూతనంగా వచ్చిన వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు 'ఆటోమేటిక్ రిలే' (పవర్ టెక్) లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా అనేక ఏళ్ల నుంచి అన్నదాతలు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ ఆటోమేటిక్ రిలేల వలన విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా తర్వాత విద్యుత్ సరఫరా జరిగితే ఆటోమేటిక్ రిలేల వల్ల మోటర్లు తనంతటకు తానే నడుస్తాయి. దీనివలన రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. గత నెల రోజుల నుంచి విద్యుత్ సరఫరా ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. దీంతో బ్రాహ్మణపల్లి అన్నదా తలందరూ పూర్తిస్థాయిలో వ్యవసాయ విద్యుత్ మోటార్లకు ఆటోమేటిక్ రిలేలను ఏర్పాటు చేసుకున్నారు. దీని వలన రైతులు సమయం వృధా కాకుండా, పంటలు ఎక్కువ మొత్తంలో ఎండిపోకుండా, విద్యుత్ మోటార్ల వద్ద వేచి ఉండకుండా కరెంటు సరఫరా జరిగినప్పుడు ఆటోమేటిక్ రిలేల వల్ల మోటర్లు నడుస్తున్నాయి. దీంతో ఎంతోకంత పంటలను కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ విషయాన్ని పసిగట్టిన విద్యుత్ అధికారులు రంగంలోకి దిగారు. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండటంతో విద్యుత్ అధికారులు ఆటోమేటిక్ స్టార్టర్లను తొలగించాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రైతులకు తెలియకుండా బోనకల్ విద్యుత్ సిబ్బంది అక్రమంగా కొంతమంది రైతులకు చెందిన సుమారు 10 నుంచి 15 ఆటోమేటిక్ రిలే లను తొలగించి తీసుకెళ్లారు. ఈ విషయం అన్నదాతలకు తెలియటంతో అప్రమత్త మయ్యారు. మరలా యధావిధిగా బోనకల్ విద్యుత్ సిబ్బంది సుమారు14 మంది నాలుగు టీములుగా ఏర్పడి ఆటోమేటిక్ రిలే లను తొలగిస్తున్నారు. ఈ విషయం తెలిసిన అన్నదాతలు సుమారు 60 మంది రైతులు సంఘటన స్థలానికి వెళ్లారు. ఆటోమేటిక్ రిలేలను తొలగించడానికి వీలులేదని అన్నదాతలు అడ్డుకున్నారు. అయినా విద్యుత్ సిబ్బంది బలవంతంగా వాటిని తొలగిస్తూనే ఉన్నారు. చివరకు అన్నదాతలు ఐక్యంగా అడ్డుకోవడంతో ఆగిపోయారు. తొలగించిన ఆటోమేటిక్ రిలే లను ఇవ్వాలని అన్నదాతలు పట్టుబట్టగా అందుకు విద్యుత్ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆగ్రహంతో అన్నదాతలు విద్యుత్ సిబ్బందిని తీసుకువచ్చి స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బందికి అన్నదాతలకు పెద్ద ఎత్తున వాదోపవాదనలు జరిగాయి. చివరకు రెండు గంటల తర్వాత విద్యుత్ సిబ్బంది రైతులకు వాటిని తిరిగి ఇచ్చివేశారు. దీంతో అన్నదాతలు విద్యుత్ సిబ్బందిని గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి విడిచిపెట్టారు. కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ జెర్రిపోతుల రవీంద్ర, రైతులు పారుపల్లి పూర్ణచంద్రరావు, పారుపల్లి నరసింహారావు, ఏలూరి రమేష్, గంగసాని రాఘవరావు, చావా వెంకటేశ్వరరావు, వంగాల నరసింహ, దామల బాబు, వంగాల కృష్ణ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.