Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్ర
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మచారి
నవతెలంగాణ-బూర్గంపాడు
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని, అందరిని పర్మినెంట్ చేయాలని, బిల్ కలెక్టర్లు కారోబార్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మచారి అన్నారు. ఆదివారం మండలంలోని సారపాక గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్మికులతో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ నెల 12 నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు పాలకుర్తి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ పాదయాత్రకు మద్దతుగా ఈ నెల 20వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దమ్మ తల్లి గుడి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాదయాత్ర జయప్రదం చేయాలని ఆయన అన్నారు. పంచాయతీ కార్మికులకు రావలసిన మూడు నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరి వరదల సమయంలో ఒక నెల వేతనం అదనంగా చెల్లిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ఆయన అన్నారు. కార్మికులకు నెలనెలా వేతనాలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాలను కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని, ప్రభుత్వం పంచాయతీ కార్మికుల పట్ల అనుస రిస్తున్న ద్వందనీతికి వ్యతిరేకంగానే పాదయాత్ర నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పాదయాత్రలో పంచాయతీ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు యాకోబు, చారి, పద్మ, వెంకటమ్మ, సీఐటీయూ భద్రాచలం పట్టణ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.