Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కళ్లెదుటే ఎండిపోతున్న మొక్కజొన్న
- రెగ్యులేటర్ లేక ఆంధ్రాకు తరలిపోతున్న సాగర్ నీరు
నవతెలంగాణ- బోనకల్
ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు ఆళ్ళపాడు అన్నదాతలు పడుతున్న కష్టాలు చూస్తే హృదయం కరిగిపోతుంది. బోనకల్లు బ్రాంచి కెనాల్లో నీటి కోసం అన్నదాతలు వివిధ రకాల చెట్ల కొమ్మలతో, వస్తువులతో అడ్డుకట్ట వేసి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెగ్యులేటర్ లేక ఆంధ్రకు ఎక్కువ మొత్తంలో తరలిపోతున్నాయి. ఎండుతున్న మొక్కజొన్న కాలువ చివరి భూములైన ఆళ్ళపాడు, బోనకల్, గోవిందాపురం ఏ, రావినూతల, నారాయణపురం తదితర గ్రామాలకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. యాసంగిలో సాగుచేసిన వేలాది ఎకరాల మొక్కజొన్న పైరు ప్రస్తుతం కంకి వేసే దశలో ఉంది. ఒకవైపు మండుతున్న ఎండలు మరొకవైపు నీటి తడులందక పంట దెబ్బతిని దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉండటంతో అన్నదాతలు సాగునీటి కోసం సాగరు అధికారుల చుట్టూ, కాలువల చుట్టూ తిరుగుతున్నారు. ప్రధానంగా బోనకల్ బ్రాంచ్ కెనాల్ (బి బి సి) పరిధిలోని ఆళ్ళపాడు మేజర్ కు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిని క్రమబద్ధీకరించే రెగ్యులేటర్ నిర్మించకపోవడంతో తెలంగాణ రైతుల కోసం విడుదల చేసిన నీరంతా ఆంధ్ర రైతులకు చిరులు కురిపిస్తుంది. అంతేకాకుండా కొందరు ఉన్నత స్థానాలలో ఉన్న ఆంధ్ర అధికారులు తమ ప్రాంత రైతుల సాగునీటి అవసరాల నిమిత్తం తెలంగాణ రైతుల పొట్ట కొట్టి సాగునీటిని దొంగ చాటుగా ఆంధ్రాకు తరలిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. దీంతో తెలంగాణ రైతులు కాలువల చుట్టూ రాత్రి, పగలు సాగునీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే అనేక మార్లు సాగునీటి కోసం తాము ఆందోళనలు చేసినా నీటిపారుదల శాఖ అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ అధికారులతో పాటు జిల్లా ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా రైతులు భారీ మూల్యం పంట నష్టం ద్వారా చెల్లించుకోవలసి వస్తోంది. నెలరోజులుగా రైతులు సాగునీటి కోసం ఆందోళనలు చేస్తున్న పట్టించుకున్న ప్రజా ప్రతినిధులు లేకపోవడం విశేషం. రైతులు ఆందోళనలతో పాటు ఆంధ్రకు తరలుతున్న సాగునీటిని అడ్డుకునేందుకు ఆళ్ళపాడు రైతులు భారీగా ఆళ్ళపాడు మేజర్ వద్దకు చేరుకొని తమ వాటా నీరు పొందేందుకు కాలువకు అడ్డుగా రాళ్లు పెట్టి, కంపనరికి వేసి నీళ్లు తరలించుకుపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ అరకొరగా వస్తున్న ఆ నీటిని కూడా తెలంగాణలో పనిచేస్తున్న కొందరు అధికారులు దొంగచాటుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి దశాబ్దం కావస్తున్నప్పటికీ రైతులు ఆశించిన విధంగా తమ నీళ్ళు తమకు అందటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సాగర్ అధికారులు, జిల్లా ప్రజా ప్రతినిధులు స్పందించి సాగరు చివర భూముల రైతులకు న్యాయంగా దక్కవలసిన నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.