Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ పట్టణ పరిధిలోని పాలకోయ తండా వాసుల తాగునీటి సమస్యను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పాలకోయ తండా వాసులతో కలిసి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్ అనుదీప్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్‌కి కూతవేటు దూరంలో ఉన్న పాలకోయ తండాలో ఏడు నెలలుగా మంచినీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలు దాహార్తితో అల్లాడుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే వనమా పాల్వంచ మున్సిపాలిటీకీ కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపించడం లేదని విమర్శించారు. పాల్వంచ మున్సిపాలిటీకీ పాలకపక్షం లేకపోవడంతో వార్డులో ఇప్పటికీ కనీస సమస్యలు పరిష్కారం కావడం లేదని, వెంటనే పాల్వంచ మున్సిపాలిటీకీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మహిళా కన్వీనర్ కోలా మల్లికా, కేతిని కుమారి, భూక్య కళావతి, నాగేశ్వరరావు, చింతలచెరువు కమల, దీపలి తదితరులు పాల్గొన్నారు.