Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజామాబాద్, ఆదిలాబాద్ రీజియన్లకు పంపిన డ్రైవర్లను ఖమ్మం రీజియన్‌కు రప్పించాలి
- ఆర్టీసీ ఆర్ఎంకు వినతి
నవతెలంగాణ- ఖమ్మం
ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో అదనపు సిబ్బంది పేరుతో డ్రైవర్, కండక్టర్లను హైదరాబాద్ జోనకు చేసిన బదిలీలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కార్మికుల కుటుంబాల పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఆదిలాబాద్, నిజామాబాద్ రీజియన్లకు పంపిన డ్రైవర్లను వెంటనే ఖమ్మం రీజయన్‌కు రప్పించాలని సిఐటీయూ జిల్లా ఆధ్యక్షులు తుమ్మ విష్ణు వర్థన్, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు సోమవారం ఆర్టీసీ ఖమ్మం ఆర్ఎంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం రీజియన్‌లో సుమారు 15 సంవత్సరాల నుండి విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లను మిగులు సిబ్బంది పేరుతో 64 మందిని ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్ రీజియన్లకు బదిలీ చేశారని, మరలా 40 మంది డ్రైవర్లను, 40 మంది కండక్టర్లను గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చియున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ జోన్లో కండక్టర్లు సరిపడ ఉన్నారని, మన రీజియన్ నుండి పంపిన కండక్టర్లను తీసుకోలేదని, వారిని తాత్కాలికంగా ఆపారని, డ్రైవర్లను వేరే రీజియన్లకు పంపుట వలన మన రీజియన్‌లో ప్రతి డిపోలో కార్మికులు డబుల్ డ్యూటీలు చేస్తున్న విషయం గమనించాలన్నారు. అలాగే మన రీజియన్‌లో కొత్తగా ఇల్లందు డిపో ప్రారంభమవుతుందని, డిపోకు సిబ్బంది అవసరం ఉందన్నారు. ఎడిసి, కంట్రోలర్ పదోన్నతుల కోసం విల్లింగ్ అడిగియున్నారని, ప్రమోషన్స్ తర్వాత కండక్టర్లు, డ్రైవర్లు అవసరం ఉందని తెలిపారు. అంతేకాక నష్టాల పేరుతో గ్రామీణ ప్రాంత సర్వీసులను రద్దు చేయడం వలన ప్రయాణికుల నుండి, విద్యార్థుల నుండి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఆర్టీసీకి పీక్ సీజన్ రీత్యా డిమాండ్ మేరకు అదనపు బస్సులను నడుపుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని, కొత్తగా వచ్చిన సూపర్ లగ్జరీ బస్సులతో డిమాండ్ మేరకు అదనపు కిలోమీటరు తిప్పుకోవాల్సిన అవసరం ఉందని, వీటన్నంటి దృష్ట్యా సిబ్బంది మన రీజియన్‌లో అవసరం ఉన్న సమయంలో బదిలీలు చేయుట వలన కార్మికులు తీవ్ర అశాంతితో అభద్రత భావంతో ఉన్నారని తెలిపారు. హైదరాబాదు జోనుకు బదిలీ చేయబడ్డ పలువురు డ్రైవర్లు, కండక్టర్లు తమ కుటుంబాల, ఇంటిదగ్గర వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పరిస్థితులను రీజినల్ మేనేజర్ దృష్టికి తేవడం కోసం ఆర్ఎం కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారి సమస్యలన్నీ తెలుసుకున్న సిఐటియు, ఏఐటీయుసీ నాయకులు రీజనల్ మేనేజర్ వద్ద సమస్యలను ప్రస్తావించారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎర్రా శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు వై.విక్రమ్, జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.