Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్ సూచించారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 15 నుండి మార్చి 2 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 4న ఎథిక్స్ ఆండ్ హ్యుమన్ వాల్యూస్, మార్చి 6న ఎన్విరాన్ మెంటల్ సైన్స్ పరీక్షలు, 15 మార్చి నుండి ఇతర సబ్జెక్టుల పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డు, హైదరాబాద్ ఆదేశాలను జారిచేసిన క్రమంలో జిల్లాలో పరీక్షల నిర్వహణకు 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కేంద్రాల్లో 17,890 మంది మొదటి, 17,967 రెండో సంవత్సరం మొత్తంగా 35,857 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్, థియరీ పరీక్షల ప్రశ్నపత్రాలు భద్రపర్చేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షలు ముగిసే వరకు కేంద్రాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, పరీక్ష సమయానికి పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. పరీక్షా కేంద్రాల్లో సిసి కెమరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గదిలో సిసి కెమెరాల నిఘాలో ఉన్నట్లు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో అనుమతించ కూడదని తెలిపారు. తాగునీరు, కనీస మౌళిక సదుపాయాల కల్పన చేయాలని, వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. కేంద్రం దగ్గర్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని అన్నారు. కేంద్రం లోపల, వెలుపల పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవిన్యూ అధికారి ఆర్.శిరీష, జెడ్పి సిఇఓ వివి.అప్పారావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, ఎస్బి ఏసిపి డి.ప్రసన్నకుమార్, జిల్లా విద్యాశాఖాధికారి ఇ.సోమశేఖరశర్మ, జిల్లా వైద్యాధికారి డా. బి.మాలతి, ఆర్సీవోలు జ్యోతి, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్లోగా 'మన ఊరు-మన బడి' పూర్తి
'మన ఊరు-మన బడి' లో భాగంగా చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఐడిఓసి సమావేశ మందిరంలో విద్యాశాఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మన ఊరు-మన బడి కార్యక్రమ పురోగతిపై కలెక్టర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. మన ఊరు- మన బడిలో జిల్లాలో 426 పాఠశాలలను మొదటి విడత లో ఎంపిక చేసి, మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. 15 శాతం పాఠశాలల పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేసుకొని, ప్రారంభించుకున్నట్లు వివరించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని, పనులు దగ్గరుండి పూర్తి చేయించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. పనులు పూర్తయిన వరకు ఎంబి రికార్డులు నమోదు చేసి, ఎఫ్టివోలు జనరేట్ చేయాలన్నారు. పనుల పూర్తిలో 29 శాతమే నమోదు చేసినట్లు తెలిపారు. రికార్డు నమోదు చేయకపోవడం, ఎఫ్టివోలు జనరేట్ చేయక పోవడంతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి అన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. పనులు ఈ విద్యా సంవత్సరం లోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.