Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5న చలో డిల్లీ జయప్రదం చేయాలి
- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ -చింతకాని
రైతులు, కార్మిక రంగంపై వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంయుక్తంగా పోరు నిర్వహించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం చింతకాని మండల కేంద్రంలో రైతు సంఘం మండల కార్యదర్శి తోటకూరి వెంకట నర్సయ్య అధ్యక్షతన జరిగిన రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియూ మండల కమిటీ సమావేశంలో నున్నా మాట్లాడుతూ ప్రపంచీకరణ విధానాల అమలుతో రైతులకు కనీస మద్దతు ధర దొరకడం లేదని, ఉపాధిహామీ, ఆహార భద్రత, కనీసవేతనాలు లేకుండా పోతున్నాయని వివరించారు. మోడీ చెప్పే అచ్ఛేదిన్ రైతులకు, వ్యవసాయ కార్మికులకు కాదని అన్నారు. ప్రధాని మోడీ రైతుల పోరాటాన్ని పంజాబ్లో ఒక ప్రాంతానికి చెందినదని తక్కువ చేసి మాట్లాడారని, కానీ దేశవ్యాప్తంగా విస్తరించి మోడీ నోరు మూయించిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమంలో వ్యవసాయ కార్యికులు కూడా కలిసి రావడం వల్లే ఉద్యమం తీవ్రమై కేంద్రం దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మతోన్మాదులు, కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఉద్యమానికి ఇది సరైన సమయమని వివరించారు.బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి దాదాపు రూ.30 వేల కోట్లు (45 శాతం) తగ్గించారని విమర్శించారు. రైతులు, వ్యవసాయ కార్మికులకు అన్యాయం జరిగిందని అన్నారు. తీవ్ర స్ధాయిలో కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ , సిఐటియూ జిల్లా నాయకులు మడిపల్లి గోపాలరావు, వ్యవసాయకార్మిక సంఘం నాయకులు వత్సవాయి జానకి రాములు, సిఐటియూ మండల కన్వినర్ గడ్డం రమణ, రైతు సంఘం మండల అధ్యక్షులు మద్దిన్ని బసవయ్య, నాయకులు ఆలస్యం రవి, నన్నక కృష్ణమూర్తి, బల్లి వీరయ్య, రాచబంటి రాము, కాటబత్తిన వీరబాబు, లింగం కోటేశ్వరరావు, గడ్డం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.