Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
కొబ్బరి సాగుతో దీర్ఘకాలిక ఆదాయంతో పాటు, కొబ్బరి వినియోగంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని, అందుకోసం ఆయిల్ ఫాం సాగు తరహాలో కొబ్బరిని సాగు చేయాలని ఉద్యాన-పుట్టు పరిశ్రమల శాఖ జిల్లా అధికారి జినుగు మరియన్న రైతులకు సూచించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, శ్రీ కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, తెలంగాణ ఉద్యాన శాఖ, కొబ్బరి అభివృద్ధి బోర్డ్ సంయుక్త నిర్వహణలో తెలంగాణ కొబ్బరి ఉత్పత్తి దారులు సంఘం ఆద్వర్యంలో సంఘం అధ్యక్షుడు ఆలపాటి రామ్మోహన్ రావు అధ్యక్షతన మంగళవారం నారంవారిగూడెం సమీపంలోని గల కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రంలో నిర్వహించిన కొబ్బరి సాగు దారుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయి ప్రసంగించారు. ఉద్యాన శాఖ ద్వారా కొబ్బరి సాగుకు ప్రభుత్వం అందజేసే ప్రతీ ప్రయోజనాన్ని కొబ్బరి సాగు చేసే రైతులకు సమకూరేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. కొబ్బరి సాగుకు, విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కొబ్బరి అభివృద్ధి సంస్థ ద్వారా ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తుందని కొబ్బరి అభివృద్ధి సంస్థ విజయవాడ రాష్ట్ర కార్యాలయం క్షేత్ర అధికారి మత్తే కిరణ్ కుమార్ తెలిపారు. సీడీబీ ద్వారా కొబ్బరి సాగుకు ప్రోత్సాహకాలు, విస్తరణకు ప్రభుత్వం అందజేసే అనేక పధకాలను వివరించారు. ఈ సంస్థ మరో క్షేత్ర అధికారి సురేష్ కొబ్బరి సాగు, ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులు, ప్రయోజనాలను వివరించారు. కొబ్బరి సాగుదారుల సంఘం ప్రాధాన్యత, రైతులకు అందజేసే సేవలను సంఘం కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త విజరు క్రిష్ణ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ నియోజక వర్గం అధికారి సందీప్, అశ్వారావుపేట కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రం ఉద్యాన అధికారి కిషోర్, దమ్మపేట సింగిల్ విండో అద్యక్షులు రావు నాగేశ్వరరావుతో పాటు పలువురు రైతు ప్రముఖులు పాల్గొన్నారు.