Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోలార్ వీది లైట్లను ప్రారంభించిన ఎస్పీ వినీత్.జీ
నవతెలంగాణ-పినపాక
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు ఎల్లప్పుడూ అండగా పోలీసులు ఉంటారని ఎస్పీ వినీత్.జీ అన్నారు. మంగళవారం ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పినపాక మండలానికి చెందిన పిట్టతోగు గుత్తికోయ గ్రామంలో ఏర్పాటు చేసిన 05 సోలార్ విద్యుద్దీపాలను (వీది లైట్లు) ఎస్పీ ప్రారంభించారు. అదే విధంగా గ్రామంలోని 22 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రెండు చొప్పున దోమ తెరలను అందజేసారు. ఇందులో భాగంగానే తిర్లాపురం, నీలాద్రిపేట, నెమలిగూడెం, పడిగాపురం గుత్తికోయ గ్రామాలకు కూడా మొత్తం 22 సోలార్ విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. తరువాత అక్కడ ఉన్న యువకులకు వాలీ బాల్ కిట్‌ను అందజేసి వారితో కలిసి సరదాగా ఆటలో పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ గ్రామస్తులతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండి వలస వచ్చి జీవనం సాగిస్తున్న గుత్తికోయ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటారని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు. తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తున్న పోలీసువారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. నిరంతరం గుత్తికోయ గ్రామాలను సందర్శిస్తూ, వారికి కనీస సౌకర్యాలను సమకూర్చటానికి కృషి చేస్తున్న మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు, ఏడూళ్ల బయ్యారం సీఐ రాజగోపాల్, ఎస్సై నాగుల్ మీరా, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, మణుగూరు డీఎస్పీ రాఘవేంద్రరావు, సీఐ రాజగోపాల్, ఎస్సై నాగుల్ మీరా, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.