Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోళ్లపాడు చానల్‌పై పచ్చదనం
- రూ.70 కోట్లతో ఆధునికీకరణ
- పార్కులు, జిమ్‌లతో సుందరీకరణ
- కలెక్టర్ వీపీ గౌతమ్ 'మార్నింగ్‌వాక్'లో వెల్లడి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఒకప్పుడు మురికికూపంగా,..దుర్వాసన వెదజల్లుతూ... దోమలు, ఈగలతో దుర్గంధపూరితంగా ఉన్న ఖమ్మం నగరం ప్రస్తుతం ఆహ్లాదం పంచుతోందని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ఏళ్ల క్రితం పంట కాల్వైన గోళ్లపాడు చానల్ నగర విస్తరణతో మురికికూపంగా తయారైందని, దానిని స్థానిక మంత్రి పువ్వాడ అజరుకుమార్ చొరవతో రూ.70 కోట్ల నిధులతో ఆధునికీకరించి...పార్కులు, ఓపెన్‌జిమ్‌లు, ప్లేకోర్టులతో సుందరీకరించామన్నారు. నగరవాసులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని పంచుతున్నట్లు చెప్పారు. కలెక్టర్ మార్నింగ్‌వాక్‌లో భాగంగా గోళ్లపాడు చానల్‌పై జరిగిన అభివృద్ధి పనులను మీడియాకు మంగళవారం ప్రత్యక్షంగా చూపించి...వివరించారు.
నగరంలోని సుమారు 28 డివిజన్లపై గోళ్లపాడు చానల్ మురికినీటి ప్రభావం ఉండేందన్నారు. ఇప్పుడు దీనిని అండర్ డ్రెయినేజీగా మార్చామన్నారు. ఎంబీ గార్డెన్స్, సారథినగర్, జూబ్లీపుర, కాల్వొడ్డు, ఆంజనేయస్వామి గుడి, మోతీనగర్, వెంకటలక్ష్మి థియేటర్, వాసవి కళ్యాణ మండపం, బురదరాఘవాపురం, గాంధీచౌక్, గాంధీనగర్, సుందరయ్యనగర్, ప్రకాశ్‌నగర్, త్రీటౌన్ పోలీసుస్టేషన్, కుమ్మరిబజార్, మంచికంటినగర్, దాల్ మిల్ఏరియా, కోల్డ్‌స్టోరేజీ ప్రాంతం, శ్రీనివాసనగర్ మీదుగా మున్నేరుకు దారితీసే మురికినీటి ప్రవాహాన్ని ఎన్టీపీలో ప్రాసెస్ అనంతరం మున్నేరుకు మళ్లించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నిత్యం రెండు కోట్ల లీటర్ల మురికినీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న ప్లాంట్ నిర్మాణంలో ఉందన్నారు. గోళ్లపాడు చానల్ అభివృద్ధి క్రమంలో ఏళ్లుగా ఏర్పాటు చేసుకున్న 812 నివాసాలను తొలగించామన్నారు. వారికి వైఎస్ఆర్ నగర్లో సకల సౌకర్యాలతో పునరావాసాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 10.60 కి.మీ మేర అభివృద్ధి చేసిన గోళ్లపాడు చానల్ ద్వారా 32 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటిపై ఇప్పటికే పార్కులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతంలో మియావకీ ఫారెస్ట్‌తో పాటు ప్లాంటేషన్ ఏర్పాటు సైతం పూర్తయిందన్నారు. దీనిలో 6.5 కి.మీ మేర వరద నివారణ కోసం వర్షపు నీటి ప్రవాహానికి డ్రెయిన్లు నిర్మించి మున్నేరుకు మళ్లించామని చెప్పారు. డ్రెయినేజీ వాటర్ ట్రీట్మెంట్ ద్వారా పర్యావరణ హితంగా మార్చి నదీ కాలుష్య నివారణకు తోడ్పడటం, విలువైన భూముల ఆక్రమణలు తొలగించడం, ప్రజారోగ్యాన్ని పంచడం లక్ష్యంగా చెప్పారు.
ఇక గోళ్ల'పార్కు' చానల్...
గోళ్లపాడు చానల్‌పై పార్కులను నెలకొల్పి పచ్చదనం పంచుతున్నట్లు తెలిపారు. మురికి కూపంగా ఉన్న ఈ చానల్‌ను జన జీవితానికి అనుగుణంగా మార్చామన్నారు. విశాలపార్కింగ్ ప్రదేశం, ఆకట్టుకునేలా ప్రవేశద్వారాలు, ఫౌంటేన్లు, పిల్లల ఆటవస్తువులు, ఓపెన్ జిమ్‌లు, స్కేటింగ్ రింగ్‌లు, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బాస్కెట్‌బాల్, షటిల్, మెగా చెస్‌బోర్డు, రిలాగ్జేషన్ కోసం బెంచీలు, పంచతత్వ మెడిసిన్ ప్లాంటేషన్‌తో ఆహ్లాదం...ఆరోగ్యం పంచుతున్నట్లు వివరించారు. ప్రకాశ్‌నగర్, ప్రొఫెసర్ జయశంకర్, పుచ్చలపల్లి సుందరయ్య, మంచికంటి రాంకిషన్‌రావు, కాళోజీ నారాయణరావు, దాల్మిల్, వనజీవి రామయ్య, కొండా లక్ష్మణ్‌బాపూజీ, మోతీనగర్, కాల్వవొడ్డు వెండరింగ్ జోన్, జూబ్లిక్లబ్ రజబ్అలీ, ఎఫ్‌సీఐ గోదాం ఇలా ఏరియాల వారీగా పార్కులు నెలకొల్పి, వాటికి మహనీయుల పేర్లు పెట్టినట్లు చెప్పారు. ఇప్పటికే ఏడు పార్కులు పూర్తికాగా మరో నాలుగు నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయన్నారు. గోళ్లపాడు చానల్ అభివృద్ధికి డిజైన్ రూపకల్పన చేసి, సకాలంలో పూర్తి చేసిన మున్సిపల్ ఎస్ఈ వి.రంజిత్ పాటు ఇంజినీరింగ్ బృందాన్ని కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ వెంట నగర పాలకసంస్థ కమిషనర్ ఆదర్శ్‌సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, కార్పొరేషన్ అధికారులు ఉన్నారు.